
ఎంసెట్-2 లీక్ నిజమే.. రూ.15 కోట్ల డీల్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీనికోసం రూ.15కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాజాగా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.
పరీక్షకు రెండు రోజుల ముందు పేపర్ లీక్ అయిందని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. ఈ లీక్ ద్వారా 30 మంది విద్యార్థులు లబ్ది పొందినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. ముంబై, బెంగళూరులో నిందితులు మెడికల్ ఎంట్రన్స్ పేపర్ ను లీక్ చేసి విద్యార్థులకు అందించారు. లీకైన పేపర్తో బెంగళూరులో ప్రాక్టీసు చేశారని.. దాన్నే యథాతథంగా పరీక్షలో రాయడంతో వాళ్లకు మంచి ర్యాంకులు వచ్చాయని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. వైద్యవిద్య పీజీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసినవాళ్లే.. దీనికి కూడా పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. బెంగళూరు, ముంబై నగరాలతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసులు దర్యాప్తు చేశారు. రమేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమంది విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్లో వందల్లోనే ర్యాంకులు రావడంతో మొదలైన అనుమానం.. చివరకు డొంక మొత్తాన్ని కదిలించింది. దాంతో ఈ బాగోతం అంతా బయటపడింది. తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొంతమంది తల్లిదండ్రులు తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. వాళ్లు సెక్రటేరియట్కు చేరుకుని, ఇలా లీకైన పేపర్లతో పరీక్ష నిర్వహిస్తే తమ పిల్లల గతేం కావాలని ప్రశ్నించారు. దాంతో దర్యాప్తునకు ఆదేశించగా.. చివరకు అసలు విషయం నిగ్గుతేలింది.