లేదంటే వడ్డీతో చెల్లించాలి.. స్థానిక సంస్థల నిధులపై రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘం నుంచి అందిన నిధులను రాష్ట్రాలు పక్షం రోజుల్లోగా స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని లేని పక్షంలో వడ్డీతో సహా స్థానిక సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని సంఘం తెలిపింది. స్థానిక సంస్థలు ప్రోత్సాహక నిధులు అందించడంలో భాగంగా 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఏయే కార్యక్రమాలకు నిధులు వినియోగించాలో స్పష్టం చేసింది.
ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు...
ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికే ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలి.
మంచినీరు, పారిశుధ్యం, మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, కమ్యూనిటీ ఆస్తులు, రహదారుల నిర్వహణ, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, శ్మశానాలు, శవ దహన వాటికల నిర్వహణకు వాడాలి. స్థానిక సంస్థలు ప్రోత్సాహక నిధులు పొందాలంటే.. ఆ సంస్థలకు వచ్చే ఆదాయ, వ్యయాలు కచ్చితంగా ఉండాలి. అందుకోసం ప్రతీ ఏడాది ఆడిటింగ్ నిర్వహించాలి.
స్థానిక సంస్థల ఆదాయం ప్రతీ ఏడాది పెరగాలి. ఆ పెరుగుదల ఆడిట్‌లో ప్రతిబింబించాలి.
మున్సిపాలిటీలు అయితే వారందించే సేవలకు ప్రమాణాల స్థాయిని నిర్ధారించాలి. గ్రామ పంచాయతీలకు కూడా నిధుల ఆడిటింగ్ తప్పనిసరి. రెండేళ్లకు మించి ఆడిటింగ్ చేయకుంటే పంచాయతీలకు ప్రతిభా ప్రోత్సాహక నిధులు చెల్లించరు. ఆడిటింగ్ చేసిన సంస్థలకు ఆ నిధులు మళ్లిస్తారు.
గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల్లో 90 శాతం బేసిక్ గ్రాంట్లుగా, 10 శాతం ప్రోత్సాహక గ్రాంట్లుగా అందిస్తారు. మున్సిపాలిటీలకు 80 శాతం బేసిక్ గ్రాంట్లుగా, 20 శాతం ప్రోత్సాహక గ్రాంట్లుగా వస్తాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అన్ని కుళాయిలకు నీటి పన్ను వసూలు చేయాలి. స్థానిక సంస్థలకు ఆస్తి పన్ను ఆదాయ వనరు. ఆస్తిపన్ను వసూళ్లు సరిగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు జరగాలి. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో భూ వినియోగ మార్పిడి ఫీజులు, ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలి. పట్టణాల్లో ఆస్తిపన్నును స్వయం మదింపు పద్దతిని అమలు చేయాలి. ప్రకటనలు, వినోదంపై పన్నులు పెంచాలి. ఆయా రాష్ట్రాలు ఈ పన్నుల విధానాన్ని సవరించాలి. పట్టణ స్థానిక సంస్థలు నిర్వహణ, అమలుకు అయ్యే ఛార్జీలను పూర్తిగా ప్రజల నుంచి వసూలు చేయాలి.
పక్షం రోజుల్లోగా నిధులు బదిలీ
Published Wed, Feb 25 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement