హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజా సమస్యలు టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. రైతులు, అంగన్వాడీలు, డ్వాక్రా గ్రూపుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఇష్టారాజ్యంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. సభలోనే అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఏ మేరకు సబబు అని అధికార పార్టీని శ్రీకాంత్రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఒకే చోట అధికారాన్ని కేంద్రీకరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు ఈ ప్రభుత్వం సహకరించడం లేదంటూ టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.