మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు ఎవరికోసం?
బాబు ఆలోచనంతా అవినీతిపైనే: గడికోట
సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో చేపడుతున్న మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు ఎవరి కోసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అవినీతి కోసం ‘తాత్కాలికం’ పేరుతో విచ్చలవిడిగా అవినీతిని సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో గడికోట మాట్లాడారు. ‘2015 ఏప్రిల్ 10న కుటుంబ వ్యవహారంలా అమరావతికి ఒకసారి శంకుస్థాపన చేశారు.
మళ్లీ 2015 అక్టోబర్ 22న రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రధానిని పిలిచి కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారంటూ గొప్పలు చెప్పారు. కానీ ప్రధాని చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి ఇచ్చి శంకుస్థాపన చేసి వెళ్లార’ని ఎద్దేవా చేశారు. మళ్లీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కోర్ కేపిటల్‌లో మళ్లీ శంకుస్థాపన చేస్తారని, అయితే అధికారికంగా కాదని చెప్పడం వెనుక కారణాన్ని ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం మేలు చేశారని అరుణ్ జైట్లీని ప్రశ్నించకపోగా.. అన్నీ ఇచ్చినట్లు బుక్‌లెట్ వేయించి అందరికీ చెప్పుకుంటానని, కేసుల నుంచి కాపాడండి అని జైట్లీని చంద్రబాబు వేడుకుంటున్నారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.సచివాలయంలో ప్రతి మంత్రీ వాస్తు బాగోలేదని కట్టిన నిర్మాణాన్ని కూలుస్తూ డబ్బులు వృథా చేస్తున్నారన్నారు.