సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటికే సర్వీసు చార్జీలు, అదనపు చార్జీల పేరుతో సగటు వినియోగదారుడి జేబు గుల్లచేస్తున్న సెంట్రల్ డిస్కం అధికారులు వినాయకులనూ వదలడం లేదు. విద్యుత్ కనెక్షన్, వినియోగించేలోడ్‌తో సంబంధం లేకుండా గణేష్ మండపాలన్నింటికీ ఒకే తరహా చార్జీలను వర్తింపజేస్తున్నారు. కనెక్షన్ల పేరుతో భక్తులను భారీగా దోచుకుంటున్నారు. మరో రెండురోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అనేకమంది మండపాల నిర్వాహకులు విద్యుత్తు కనెక్షన్ కోసం అధికారులకు దరఖాస్తు చేశారు.
నిబంధనల ప్రకారం 500 వాట్స్‌కు రూ.500, ఒక కిలోవాట్స్‌కు రూ.1750, ఆపై ప్రతి అదనపు కిలోవాట్‌కు ఒక్కో ధర నిర్ణయించారు. కానీ మండప అవసరాలతో సంబంధం లేకుండా, చిన్నవి పెద్దవని లేకుండా..నిర్వహకులందరినీ ఒకే గాడిన కట్టి, వారి నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.
బిల్లు చెల్లించినా..కనెక్షన్ ఇవ్వరు : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో అధికారికంగా ఏటా ఎనిమిది నుంచి తొమ్మిదివేల విగ్రహాలను ప్రతిష్టిస్తుండగా, అనధికారికంగా వీటి సంఖ్య 25వేలకుపైనే ఉంటున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీహాళ్లు, కాలనీల్లో మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో చాలామంది నిర్వాహకులు రెండు లైట్లు, ఒక మైకు మినహా విద్యుత్‌ను ఖర్చుచేసే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం లేదు కానీ, అది ఇదీ అనే తేడా లేకుండా అందరి నుంచి ఒకే తరహాచార్జీలు వసూలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిగినంత బిల్లు చెల్లించినా సిబ్బంది కనెక్షన్ ఇవ్వడం లేదు. దీంతో పోల్ నుంచి నిర్వహకులే నేరుగా కనెక్షన్ తీసుకుంటున్నారు. విద్యుత్ లైన్స్, సరఫరా వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు లేకపోలేదు.
చిన్న మండపానికి రూ.1750 చెల్లించాలా..?
మండపాలకు ప్రభుత్వమే ఉచిత కరెంటు ఇవ్వాలని గతంలోనే విన్నవించాం. అయినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. చిన్న మండపాలకు కూడా రూ.1750 మొత్తాన్ని ఎలా వసూలు చేస్తారు. ఇప్పటికైనా దోపిడీ ఆపి వెంటనే ఉచిత విద్యుత్తు ఇవ్వాలి.
-కె.గోవర్దన్‌రెడ్డి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి
సరూర్‌నగర్ మండల శాఖాధ్యక్షుడు
ఇదేం వసూలు..?
Published Sun, Sep 8 2013 4:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement