రాష్ట్రంలో 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో
♦ ముందుకు పడని అడుగులు
♦ డీఎస్సీల్లో నష్టపోయిన వారి పరిస్థితేంటి?
♦ ముఖ్యమంత్రి వరంగల్‌లో హామీ ఇచ్చి ఏడాది
♦ ఆందోళనలో అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు కూడా ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చి సరిగ్గా ఏడాది కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. సీఎం పదేపదే చెబుతున్నా.. విద్యాశాఖ, న్యాయ శాఖ.. వివిధ శాఖల పరిశీలన పేరుతోనే కాలయాపన కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈ అంశంపై మాట్లాడారు. అయినా ఆచరణ దిశగా అడుగులు పడలేదు.
శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసినా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. దీంతో డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
గత ఏడాది జనవరిలో కేసీఆర్ వరంగల్‌లో పర్యటించినప్పుడు 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ తరువాత ఒకసారి జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారితోపాటు 2012 వరకు నిర్వహించిన మిగతా 5 డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అది ఇంతవరకు ఆచరణ కు నోచుకోలేదు. అభ్యర్థులు అధికారులు, మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేదు. ఆరు నెలలుగా ఫైలు జీఏడీ, న్యాయ శాఖ పరిశీలనలో ఉందంటూ దాట వేస్తున్నారు.