గులాబీ జోష్..!
* పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ విజయవంతం
* సీఎం హామీలతో టీఆర్‌ఎస్ శ్రేణుల ఖుషీ
సాక్షి, సిటీబ్యూరో: అధికార టీఆర్‌ఎస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్‌లోనిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం గ్రేటర్ గులాబీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సీఎం కేసీఆర్ పాల్గొన్న ఈ సభకు నగరంలోని 150 డివిజన్ల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు వేలాది జనాన్ని తరలించారు. నగరాభివృద్ధిపై సీఎం చేసిన ప్రసంగం తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేటర్ అభ్యర్థులను సీఎం ప్రజలకు పరిచయం చేస్తూ అవినీతి రహితంగా పాలన అందిస్తామని..పైసా లంచం ఇవ్వకుండా ప్రజలు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు కృషి చేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయిస్తున్నానని ప్రకటించడంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, వరద కాల్వల ప్రక్షాళన, ముంపు సమస్యల పరిష్కారానికి సుమారు రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని హామీ ఇవ్వడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్‌గా మారిన విషయం విదితమే.
శనివారం సభతో ముఖ్యమంత్రి స్వయంగా నగర అభివృద్ధిపై విజన్ ఆవిష్కరించడంతో పాటు గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అంచనాలకు మించి అన్నివర్గాల జనం తరలిరావడంతో బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలపై విశ్వాసం పెరిగిం దన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి, డివిజన్ల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.