అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు గ్రేటర్ నగరం ముస్తాబైంది.
టీఆర్‌ఎస్ బహిరంగ సభకు గ్రేటర్ ముస్తాబు
నగరం నుంచి మూడు లక్షల జన సమీకరణ
ఏర్పాట్లలో మంత్రులు బిజీ బిజీ
సాక్షి, సిటీబ్యూరో:అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు గ్రేటర్ నగరం ముస్తాబైంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్‌లో వేదిక, బారికేడ్లు, ఆడియో, లైటింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పనులను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఆదివారం పరిశీలించారు. వేదిక ఏర్పాటు బాధ్యతను ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తీసుకున్నారు. ఈ సభకు గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులకు లక్ష్యం నిర్దేశించారు. జన సమీకరణకు బస్తీలు, కాలనీల ముఖ్య నాయకులను కలవడంతో పాటు... సభకు హాజరయ్యేందుకు కార్యకర్తలకు అవసరమైన వాహనాలను నాయకులు ఇప్పటికే సమకూర్చారు.రాబోయే బల్దియా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం... గ్రేటర్ క్యాడర్‌లో జోష్ నింపడం... ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఈ సభను వినియోగించుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గులాబీ వనంగా నగరం...
బహిరంగ సభ నేపథ్యంలో పది జిల్లాల నుంచి నగరానికి వచ్చే కార్యకర్తలకు ఘన స్వాగతం పలికేందుకు ముఖ్య రహదారులపై భారీ ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలు, మైదానం గులాబీ జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. గ్రౌండ్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నేతల ప్రసంగాలు దూరప్రాంతాలకు వినిపించేలా సౌండ్‌సిస్టంను ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు, సభకు హాజర య్యే వారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి ముఖ్య కార్యవర్గంతో పాటు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, తెలంగాణ వాదులు సభకు హాజరయ్యేలా చూసేందుకు డివిజన్ స్థాయి నేతలతో మంత్రులు ప్రత్యక్షంగా మాట్లాడారు. సభను విజయవంతం చేయాలని కోరారు.
ఆటుపోట్ల ప్రస్థానం...
సుమారు 14 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో అస్తిత్వ పోరాటం చేసిన టీఆర్‌ఎస్... నేడు అధికార పార్టీగా అవతరించి... భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం విశేషం. 2001 ఏప్రిల్ 27న నగరంలోని జలదృశ్యంలో అధినేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. తొలినాళ్లలో పార్టీ ఉనికిని చాటుకునేందుకు పెద్ద పోరాటమే చేసింది. జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం వరకు ఎదిగిన తీరు పార్టీ వర్గాలను సైతం అబ్బురపరుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటుటోంది.ప్రధాన పార్టీల నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకొని... రాబోయే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేయాలన్నదే నగర మంత్రులు, అధినేత లక్ష్యమని గ్రేటర్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారని... వీటిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఇటీవలే టీఆర్‌ఎస్ గ్రేటర్ విభాగం అధ్యక్షునిగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో పార్టీని అజేయశక్తిగా మలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపాయి.
హోం మంత్రి పరిశీలన
రసూల్‌పురా: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సోమవారం జరుగనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కలసి ఆదివారం పర్యవేక్షించారు. బందోబస్తు విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తే బస్సులను ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్లు హామీ ఇచ్చారని... నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 14 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పార్టీ కోసం పని చేస్తున్నారని కొనియాడాఉ. బంగారు తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హరీష్‌రావు అలకబూనినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. హోంమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎమ్మేల్యే రసమయి బాలకిషన్, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఏసీపీ గణేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బందోబస్తుపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: టీఆర్‌ఎస్ బహిరంగ సభ బందోబస్తును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సమీక్షించారు. బహిరంగ సభలకు వచ్చే ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బందోబస్తులో 4000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. నగర పోలీసులు, టీఎస్‌ఎస్‌పీ, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామన్నారు. అదనపు పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కలిసి బందోబస్తు చర్యలను స్వయంగా పరిశీలించారు. బందోబస్తులో పాల్గొంటున్న అధికారులకు నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు తగిన సూచనలిచ్చారు.