
ఫైన్ సిటీ!
సివీక్ సెన్స్
గ్రేటర్ సిటీ.. ‘ఫైన్’ సిటీ అవతారమెత్తింది. మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 1.2 కోట్ల ట్రాఫిక్ చలాన్లు, రూ.239.86 కోట్ల జరిమానాల వసూలుతో రికార్డు సృష్టించింది. గ్రేటర్‌లో జరిగిన నేరాల్లో ప్రజలు పోగొట్టుకున్న సొత్తు కంటే ట్రాఫిక్ ఉల్లంఘనుల నుంచి వసూలు చేసిన జరిమానాలే అధికం అంటే అతిశయోక్తి కాదు. ఏకంగా చలాన్ల సంఖ్య సిటీలో వాహనాల సంఖ్యనే మించిపోవడం మరో విశేషం. దీంతో చారిత్రక నగరి కాస్త చలాన్ల నగరిగా మారింది. ఎందుకీ దుస్థితి..? ఎవరు దీనికి బాధ్యులు? నిబంధనలు పట్టని వాహన దారులా.? మౌలిక వసతుల కల్పనలో నత్తకు నడకలు నేర్పుతున్న జీహెచ్‌ఎంసీనా.? ట్రాఫిక్ నిబంధనల అవగాహనలో విఫలమైన పోలీసులా..?
ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు, వాహనాదారుల నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యమే ఈ మూల్యం. వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వాహనాదారులను ఎడ్యుకేట్ చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. మరోవైపు నిబంధనలు తెలిసి కూడా వాహనచోదకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చలాన్లతో ఖజానాకు కాసుల పంట పండితే.. ట్రాఫిక్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్ అట్టడుగున నిలుస్తోంది.
రోజుకు 11 వేల ఉల్లంఘనలు..!
‘నేనొక్కడినే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది’ ఇది సగటు పౌరుడి మనస్తత్వంగా మారింది. సిటీలో రోజుకు 11 వేల మందికి పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. సిటీలో ట్రాఫిక్ రాకెట్ వేగంతో పెరుగుతోంది. నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. ఇదే అదునుగా ట్రాఫిక్ సిబ్బంది రూల్స్ పాటించడం లేదంటూ చలాన్లపై చలాన్లు రాసేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లిస్తామంటు వాహనదారులూ వెనకడుగు వేయడం లేదు. ఎందుకిలా అంటే ట్రాఫిక్ వ్యవస్థ అలా ఏడ్చిందంటూ జనాల బాధ.
చోరీ సొత్తు కంటే జరిమానాలే ఎక్కువ!
సిటీలో దోపిడీ, దొంగతనాలు తదితర కేసుల కంటే ట్రాఫిక్ పోలీసుల చలాన్ల సంఖ్యే ఎక్కువ. 2013-15 మధ్య జంట కమిషనరేట్లలో వివిధ నేరాలకు సంబంధించి 1,28,030 కేసులు నమోదయ్యాయి. కానీ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసులు 1.2 కోట్లంటే తెల్లముఖం వేయాల్సిందే. ఇక నేరాల్లో నగరవాసులు కోల్పోయింది రూ.198.45 కోట్లు. కాగా ట్రాఫిక్ విభాగానికి ఉల్లం‘ఘనులు’ చెల్లించిన మొత్తం రూ.239.86 కోట్లు.
ఏది రెడ్.. ఏది గ్రీన్?
జంక్షన్‌లో రెండు నిమిషాలు వెయిట్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నవారు ఎందరో. వారి అత్యుత్సాహం ఎదుటి వారికీ మృత్యుపాశం అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సృ్పహ తక్కువ మందికే ఉంటోంది.అవగాహనే ఆయుధం..
ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తున్నాం. నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహనకు పెద్దపీట వేస్తున్నాం. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మార్పులు తీసుకొచ్చేలా...కళాశాలలు, పాఠశాలలకూ వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు దగ్గరవుతున్నాం.
- ఏవీ రంగనాథ్, డీసీపీ, సిటీ ట్రాఫిక్
ఎవరికి వారే మారాలి..
నగరంలో ఈ పరిస్థితులకు ఏ ఒక్కరో కారణం కాదు. ప్రభుత్వ యంత్రాగాల అలసత్వం, వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల ప్రజల జేబుకు చిల్లుపడుతోంది. అన్ని ఉల్లంఘనల్లో అత్యంత కీలకం పార్కింగ్. ఎక్కడా నిబంధనల మేర పార్కింగ్ లేదు. నిబంధనల్ని భారంగా భావించే నగరవాసి, మౌలిక వసతులు సరిగా కల్పించని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌పై అవగాహన అంశాల్ని పట్టించుకోని సిబ్బంది మారితేనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది.
- రవీందర్‌రెడ్డి, వీవీ నగర్
పార్కింగ్ వెతలు..
సిటీలోని వ్యాపార కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాలకు తగ్గట్టు పార్కింగ్ వసతులు లేవు. దీంతో వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అధికారులు వీరికి క్రేన్ లిఫ్టింగ్ జరిమానాలు, ఫొటోల ద్వారా ఈ-చలాన్‌లు విధిస్తున్నారు.