సాక్షి, హైదరాబాద్: ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయి. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ–లింక్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్ వంటి సైబర్ నేరాలు తగ్గించడానికి డీ–లింక్ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు.
నిర్వహణ కోణంలో చూసిన బ్యాంకర్లు..
సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎం కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ–లింక్ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు. డీ–లింక్ చేయడం ద్వారా ఏటీఎం మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్ చేసినా మిషన్‌కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్‌తో లింక్ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు.
మూసేయాలని సూచించిన పోలీసులు..
బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్ పోలీసులు కీలక సవరణలు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ–లింక్ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్/క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుని.. రాత్రి వేళల్లో ఏటీఎంలకు స్కిమ్మర్లు, చిన్న కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్లు తస్కరిస్తాయి.
వీటి ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేస్తుంటాయి. మిషన్‌ను డీ–లింక్ చేసినప్పటికీ వినియోగదారుడు వచ్చి అందులో కార్డు పెట్టే, పిన్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉందని పోలీసులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అలా చేస్తే స్కిమ్మింగ్ పూర్తయిపోతుందని, అలా కాకుండా ఉండాలంటే ఆయా ఏటీఎంల షట్టర్లు దింపడం ద్వారా పూర్తిగా మూసేయాలని సూచించారు. ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామని, అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment