
మాకూ పండగొచ్చింది..!
‘గ్రేటర్’ ఎన్నికల సందడి హీటెక్కింది. ప్రచారం హోరెత్తుతోంది. పార్టీలకు పండగొచ్చింది. నేతలకు ఛాన్సొచ్చింది.
‘గ్రేటర్’ ఎన్నికల సందడి హీటెక్కింది. ప్రచారం హోరెత్తుతోంది. పార్టీలకు పండగొచ్చింది. నేతలకు ఛాన్సొచ్చింది. అంతేనా.. ‘మాకూ పండగొచ్చింది’ అంటున్నాయి ఆయా పార్టీల జెండా దిమ్మెలు. అదేంటి..? అనుకుంటున్నారా అయితే దిమ్మెల కథ చదివండి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తమ జెండాలను రెపరెపలాడించడం కోసం ఆయా పార్టీలు బస్తీలు, కాలనీలు, చౌరస్తాల్లో దిమ్మెల్ని ఏర్పాటు చేశాయి. వాటికి నాయకులు పార్టీ రంగులద్ది జెండావిష్కరణలు చేశారు. ఎన్నికలు ముగిశాక వాటిని పట్టించుకున్న నాయకుడే లేడు. ఫలితంగా రహదారుల పక్కన ఉన్న ఈ దిమ్మెలు దుమ్ము కొట్టుకుపోయాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ జెండా దిమ్మెలకు పండగొచ్చింది. నేతలు వీటిని శుభ్రం చేసి రంగులద్ది కొత్త జెండాలు కట్టారు. అభ్యర్థులు గల్లీ గల్లీకి వెళ్లి జెండావిష్కరణలు చేసి ప్రచారం పర్వం సాగిస్తున్నారు. దీనికి సాధ్యమైనంత మంది స్థానికుల్ని సమీకరించి.. కొబ్బరికాయలు, అగర్‌బత్తీలు, అరటిపండ్లలో దిమ్మెలకు పూజలు చేసి జెండావిష్కరణలు చేసి జై కొట్టించుకొని వస్తున్నారు. ‘ఈ ఎన్నికలు ముగిస్తే మళ్లీ మూడున్నరేళ్ల వరకు ఈ తంతు ఉండదు. అప్పటి వరకు మా గతి అంతే... మళ్లీ ఎన్నికల వేళే మేము గుర్తుకు వస్తామేమో..?’ అంటూ నిట్టూర్చుంది ఓ జెండా దిమ్మె.
- సాక్షి, సిటీబ్యూరో