పెద్దల కంటే పేదలే నయం
బడా బాబుల కంటే సామాన్యులు చెల్లించిందేఅధికం
జీహెచ్‌ంఎసీ ఆస్తిపన్ను వసూళ్లలో వెలుగు చూసిన నిజం
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ అధికారుల మంత్రాలు బడాబాబుల ముందు అంతగా పని చేయలేదు. వారి ప్రయోగాలన్నీ సామాన్యులు, పేదలకే పరిమితమయ్యాయి. ఫలితంగా మొండి బకాయిదారులు అలాగే ఉండిపోయారు. సామాన్యులు ఎప్పటిలా పన్ను చెల్లింపులో ముందు వరుసలో నిలిచారు. సంపన్నుల కాలనీలు.. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉన్న ప్రాంతాల కంటే సామాన్యులు, పేదలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలోనే అధిక శాతం ఆస్తిపన్ను వసూలైంది. మొండి బకాయిలన్నీ బడాబాబులవేనని గుర్తించినందునే జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లకు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు.
అయినా ఫలితం అంతంతే. మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను మినహాయించి ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి వసూలైన మొత్తం రూ.1079 కోట్లు. ఇందులో ఎక్కువ శాతం చెల్లించింది సామాన్యులే. ధనికులు, రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉండే సర్కిల్-10 (ఖైరతాబాద్)లో లక్ష్యంలో 66 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, సామాన్యులు అధికంగా ఉండే మల్కాజిగిరి సర్కిల్‌లో 80 శాతం వసూలైంది.
చిన్న సర్కిల్ అయిన రామచంద్రాపురంలో 88 శాతం వసూలైంది. వ్యాపార , వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న సర్కిల్-9 (అబిడ్స్)లో అన్ని సర్కిళ్ల కంటే తక్కువగా వసూలైంది. అక్కడ అధికారులు ఎంత చెమటోడ్చినా.. కనాకష్టంగా లక్ష్యంలో 55 శాతం మాత్రమే వసూలైంది. దీని తరువాతి స్థానంలో సర్కిల్-5(చార్మినార్) ఉంది. అక్కడి వసూళ్ల లక్ష్యంలో 58 శాతం ఆస్తిపన్ను వసూలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 86 శాతం వసూలైంది.
జోన్ల వారీగా పరిశీలిస్తే..
సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉన్న వెస్ట్‌జోన్‌లో 76 శాతం వసూలు కాగా, వీఐపీలు గల సెంట్రల్‌జోన్‌లో 64 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పాతబస్తీ ఉండే సౌత్‌జోన్‌లో పన్నులు సరిగా చెల్లించరనే అపప్రధఉంది. ఈసారి ఆ జోన్‌లో 68 శాతం వసూలు కావడం విశేషం. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి.