హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు వి. శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ముఖ్యనేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ గత పాలకమండలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన బంగారి ప్రకాశ్‌లకు స్థానం లభించింది. వీరితో పాటు ఎంఐఎం నాయకులు ఎంఏ గఫార్, మీర్జా ముస్తాఫాబేగ్‌లకు సైతం స్థానం లభించింది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను 46 మంది నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, 31 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.
జీహెచ్‌ఎంసీలో అధికారిక టీఆర్‌ఎస్‌కు 99 మంది సభ్యుల బలం ఉండగా, ఎంఐఎంకు 44 మంది సభ్యుల బలం ఉంది. ఒక్కో స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికకు కనీసం పదిమంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరి మద్దతు లభించినా పది మంది ఎన్నికయ్యేందుకు అవకాశమున్నప్పటికీ, ఎంఐఎంతో స్నేహపూర్వక ఒప్పందాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణల అనంతరం బరిలో మిగిలిన 9 మంది టీఆర్‌ఎస్ సభ్యులు, ఆరుగురు ఎంఐఎం సభ్యులు స్టాండింగ్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రూ.3 కోట్ల వరకు అధికారం..
జీహెచ్‌ఎంసీలో రూ. 3 కోట్ల మేర పనుల మంజూరు అధికారం స్టాండింగ్ కమిటీకి ఉండటంతో స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంతో డిమాండ్ ఉంది. వీరు ఏడాదిపాటు సభ్యులుగా కొనసాగుతారు.
స్టాండింగ్ కమిటీలో నాయిని అల్లుడు, కేకే కుమార్తె
Published Thu, Jun 2 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
Advertisement
Advertisement