
ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త సేకరణ కోసం ఆటో ట్రాలీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. సోమవారం ఆయన 1005 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణకు ఇకపై ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. ఆకుపచ్చ బుట్టలో తడి, బ్లూ కలర్ బుట్టలో పొడి చెత్త వేయాలని, ప్రతి గృహిణి గుర్తు పెట్టుకుని సహకరించాలని కేసీఆర్ కోరారు.
ప్రపంచంలోనే హైదరాబాద్‌ను మేటి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరంలో అనేక నాలాలు కబ్జాకు గురయ్యాయని, చిన్న వర్షానికే హైదరాబాద్ జలమయం అవుతుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో నగరంలోని రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు. ఇక సమ్మె కాలంలో తొలగించిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇళ్లు, ప్లాట కోసం పేదలు తమ దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్‌ఛార్జ్ మంత్రికి గానీ దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు.