సాక్షి, హైదరాబాద్ : బాలికల విద్యను ప్రోత్సహించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బాలికల విద్యపై కేబినెట్ అడ్వైజరీ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అసోం, జార్ఖండ్ రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. అన్ని రాష్ర్టాల్లో మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బాలికల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని కడియం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎన్‌రోల్ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా బాలికల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
సమావేశంలో బాలికల విద్యకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించామని, 15,16 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయాలను 8వ తరగతి వరకూ కాకుండా 12వ తరగతి వరకూ పెంచాలని, వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న మంచి విధానాల్లో బాలికల విద్యావ్యాప్తికి తోడ్పడే 10 విధానాలను పరిశీలనలోకి తీసుకుని అమలుచేయాలని, జనవరి 15 లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment