బాలిక ప్రసవం కేసులో దర్యాప్తు ముమ్మరం
పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల ధర్నా
ఎంఈఓ బసవలింగం సస్పెన్షన్
మాదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవం కేసు దర్యాప్తును మాదాపూర్ పోలీసులు ముమ్మరం చేశారు. సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక అక్క అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న సెల్‌ఫోన్ కాల్‌డాటా ఆధారంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఎంఈఓ బసవలింగంను సస్పెండ్ చేసి, స్కూల్ టీచర్లకు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. కాగా ఈ ఘటనపై టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. బాలల హక్కులను కాపాడాలని, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు శరత్ చంద్ర, ప్రసాద్, శివ, సతీష్, సాయిరాం, సందీప్, సునీల్ తదితరులు కోరారు.
శిశు విహార్‌కు పసికందు
రాయదుర్గం: మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసవించిన విద్యార్థినిని మంగళవారం రెస్క్యూ హోంకు తరలించారు. అలాగే పసికందును శిశువిహార్ సిబ్బందికి అప్పగించారు. మొదట ఉప్పల్‌లో పోలీసులు తల్లి, పసికందును అదుపులోకి తీసుకొని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి ఐసీడీఎస్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.