గోల్కొండలో ‘షో’ చూపిస్తున్నారు!
‘సౌండ్ అండ్ లైట్ షో’లో చుక్కలు చూపిస్తున్న సిబ్బంది
- నష్టాల పేరుతో ఎగ్జిక్యూటివ్ టికెట్లను అంటగడుతున్న వైనం
- రూ.80 టికెట్ ఇచ్చేందుకు నిరాకరణ.. రూ.140 టికెట్ కొనాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బెంగళూరు వరుణ్ కుటుంబం సోమ వారం రాత్రి గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోకు వెళ్లింది. సాధారణ కేటగిరీ రూ.80 టికెట్ కావాలని కౌంటర్‌లో అడగ్గా, ఎగ్జిక్యూ టివ్ కేటగిరీ రూ.140 టికెట్ కొంటేనే అనుమ తిస్తామని సిబ్బంది తెలిపారు. రూ.60 చిన్న పిల్లల టికెట్‌నూ రూ.140కి కొనాల్సిందే నని తేల్చి చెప్పారు. అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక షో చూడకుండానే వారు వెనుదిరిగారు. కొన్ని రోజులుగా సౌండ్ అండ్ లైట్ షోలో జరుగుతున్న తంతు ఇది. దేశంలోనే టాప్ షోగా పేరున్న గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో కీర్తి మసకబారే వ్యవహారమిది.
పర్యాటక శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోల్కొండకు వచ్చే పర్యాటకులు విస్తుపోయేలా చేస్తున్నారు. గోల్కోండలో రెండు సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తుండగా నిర్వహణ సరిగా లేక ప్రదర్శనకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. రెండో ప్రదర్శనకు ప్రేక్షకులు మరీ తక్కువగా ఉంటుండటంతో నిర్వహణ ఖర్చులకు సరిపోవటం లేదంటూ రెండో తరగతి టికెట్లు అమ్మకుండా, ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలంటూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం బెంగళూరు నుంచి వచ్చిన సందర్శకులు సిబ్బందిని నిలదీస్తే ‘ఫిర్యాదు చేసుకోండి’ అంటూ దురుసుగా వ్యవహరించారు.
సమస్య ఇది..
దేశంలో ప్రస్తుతం 7 చోట్ల సౌండ్ అండ్ లైట్ షోలున్నాయి. వీటిలో తొలుత ఎర్రకోట షో మొదలైనా, రెండో విడతలో అండమాన్ జైలు, మదురై ప్యాలెస్, కోల్‌కతా విక్టోరియా మెమోరియల్‌తో కలిపి 1993లో మొదలైన గోల్కొండ షో టాప్‌గా నిలిచింది. 450 అడుగుల ఎత్తున్న కోటను రంగురంగుల 720 లైట్లతో అద్భుతంగా చూపటంతోపాటు గంటపాటు కొనసాగడం దీని ప్రత్యేకత. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా ఈ షో కోసం క్యూ కడుతుంటారు. కానీ ప్రస్తుతం ఆ లైట్లు, సౌండ్ సిస్టం పాతపడిపోవటంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త సిబ్బందిని నియమించటంతో వారికి సరైన నైపుణ్యం, అవగాహన లేక సమస్యలు పెరిగాయన్న ఫిర్యాదులున్నాయి.
ఇక నిత్యం రాత్రి 7 గంటలకు ఆంగ్లంలో వివరిస్తూ సాగే తొలి షో ఉంటుంది. 8 గంటలకు మొదలయ్యే రెండో ప్రదర్శనలో... వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తెలుగులో, మిగతా రోజుల్లో హిందీలో షో ఉంటుంది. మొదటి ప్రదర్శనకు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉన్నా రెండో ప్రదర్శన(ముఖ్యంగా తెలుగు) కు జనం తగ్గిపోయారు. సాధారణంగా ఒక ప్రదర్శనకు రూ.2,800 విద్యుత్ ఖర్చవుతుండగా అందులో సగం వసూళ్లు ఉంటేనే షో నిర్వహించే పద్ధతి ఉంది. ఇటీవల సందర్శకుల సంఖ్య తగ్గటంతో అంతమొత్తం వసూలు కాక షో నిర్వహణ డోలాయమానంలో పడింది. దీంతో వచ్చే అరకొర సందర్శకులను కచ్చితంగా రూ.140 ఉండే ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. చిన్నపిల్లకు రూ.110 వసూలు చేయాల్సి ఉండగా వారికీ ఫుల్ టికెట్ విక్రయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పర్యాటకులు వస్తే షో లేదని పంపేస్తున్నారు. ఒకేసారి 15 మంది వస్తేనే షో ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు.
కొసమెరుపు: కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా డబ్బులు రాకుంటే ఎగ్జిక్యూటివ్ టికెట్ కొనాల్సిందేనని పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో ఎక్కడా కనిపించదు. అప్పటికప్పుడు సిబ్బంది చెప్పి హడలగొడుతున్నారు.
రూ.18 లక్షల నష్టం..?
సౌండ్ అండ్ లైట్ షోకు సంవత్సరానికి రూ.కోటి పైనే ఆదాయం ఉంటుంది. ఏటా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య పెరుగుతూ ఉంటుం ది. అయితే 2015–16లో రూ.1.32 కోట్లు వసూలవగా 2016–17లో రూ.1.26 కోట్లే వసూలైంది. పెరగాల్సిన రూ.12 లక్షల ఆదాయం సమకూరకపోగా రూ.6 లక్షల నికర నష్టం వచ్చింది. వెరసి రూ.18 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో నష్టం నుంచి బయటపడేందుకు రూ.140 టికెట్లను అంటగట్టి సందర్శ కుల జేబుకు చిల్లు పెడుతున్నారు.