కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు వరుసగా ఐదు అపార్టుమెంట్స్‌లో చొరబడి వీరవిహారం చేశారు.
భాగ్యనగర్ కాలనీ: కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు వరుసగా ఐదు అపార్టుమెంట్స్‌లో చొరబడి వీరవిహారం చేశారు. వీటిలో మూడు ఫ్లాట్లలో చోరీ చేసిన దొంగలు, మరో ఐదు ఫ్లాట్లలో చోరీకి విఫలయత్నం చేశారు.
ప్రగతి నగర్‌లోని సాయిపద్మజా ప్యారడైజ్ అపార్టుమెంట్, ప్లాట్ నెం. 101లో నివసిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవితేజ తన భార్యను తీసుకొచ్చేందుకు శనివారం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు ఆయన ఫ్లాట్‌కు వేసిన తాళాలను ఆక్సా బ్లేడ్లతో కోసి బీరువాలో ఉన్న రూ.9.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో అపార్ట్‌మెంట్‌లో ఉండే రామకృష్ణ ఈనెల 23న తిరుపతి వెళ్లాడు. ఆయన ఫ్లాట్‌లో చొరబడిన దొంగలు సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు అపహరించారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉండే పార్థసారథి ఫ్లాట్ తాళాలు పగులగొట్టి ఏడు తులాల బంగారు నగలు అపహరించారు. ఆ తర్వాత వరుసగా మరో రెండు అపార్ట్‌మెంట్లలోని చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. తాళం కప్పలు గట్టిగా ఉండటంతో అవి పగలకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రగతినగర్ కాలనీలో చోరీలు చేసిన తర్వాత కేపీహెచ్‌బీ కాలనీ ఏడో ఫేజ్‌లోని ఎల్‌ఐజీ 2లో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్‌టాప్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆయా ఇంటి యజమానులు ఫ్లాట్, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు ఇంటితాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ చోరీలు స్థానిక ముఠా పనేనని, ముందుగానే రెక్కీ నిర్వహించి ఆయా ఫ్లాట్, ఇళ్లలో ఎవరూ లేరని తెలుసుకున్నాకే వరుస చోరీలకు పాల్పడ్డారని పోలీసులంటున్నారు.