
ఖమ్మం క్రైం: కొన్ని రూ. 50 నోట్లను ఎరగా వేసి కారు డ్రైవర్ దృష్టి మళ్లించి.. రూ. 25 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మంలో సోమవారం జరిగింది. నగరానికి చెందిన గుర్రం రాధిక, ఆమె కోడలు వనజ ఓ బ్యాంక్ లాకర్‌లో ఉన్న తమ బంగారు ఆభరణాలను ఓ సూట్‌కేస్‌లో భద్రపరిచి కారు సీటు కింద పెట్టి.. గాంధీచౌక్‌లోని ఓ బంగారం షాపులోనికి వెళ్లారు. డ్రైవర్‌ను కారు పార్కింగ్ చేయాలని సూచించి, బంగారం భద్రపరిచిన సూట్‌కేçస్‌ను అతడికి అప్పగించారు.
ఈలోపు గుర్తు తెలియని ఆగంతకుడు కారు వద్దకు వచ్చి ‘కింద రూ.50 నోట్లు పడి ఉన్నాయి.. అవి మీవేనా..?’అంటూ అడగడంతో అతను కిందకు దిగి వరుసగా పడి ఉన్న నోట్లను ఏరుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కారులోని సూట్‌కేసుతో పరారయ్యాడు. నోట్లు తీసుకున్నాక డ్రైవర్.. కారులో కూర్చొని సీట్ కింద ఉన్న సూట్ కేసును చూసుకోగా.. అది కనిపించలేదు. వెంట కారుదిగి చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. డ్రైవర్ వెంటనే వెళ్లి తన యజమానురాలికి విషయం చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేశ్‌రెడ్డి సందర్శించారు.
బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీ అయిన సూట్‌కేసులో బంగారం, వజ్రాల నగలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు సరిగా లేకపోవటంతో దొంగలను గుర్తు పట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment