- ఆర్‌ఓబీలు, ఫ్లైఓవర్లపై ప్రయాణానికి లేని భరోసా?
- నిర్వహణను మరిచిన పలు ప్రభుత్వ విభాగాలు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నిర్మించినవే ఫ్లైఓవర్లు/రైల్వే ఓవర్ బ్రిడ్జీ(ఆర్‌ఓబీ)లు. నగర అవసరాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్మించిన ప్రభుత్వ విభాగాలు.. నిర్వహణను మాత్రం గాలికొదిలేశాయి. ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీలను నిర్మించి ఏళ్లకు ఏళ్లు గడిచిపోవడంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్లపై ప్రయాణానికి భరోసా లేకుండాపోయింది. ఖైరతాబాద్, తెలుగుతల్లి, హఫీజ్‌పేట తదితర ఫ్లైఓవర్లపై ప్రయాణించేటప్పుడు కుదుపులు ఎక్కువ అవుతున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30 వరకూ ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీలు
గ్రేటర్ పరిధిలో పాత ఎంసీహెచ్, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ, పాత హుడా, ప్రస్తుత హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ నిర్మించిన ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీలు దాదాపు 30 వరకు ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీల్లోని ఎక్స్‌పాన్షన్ జాయింట్లు, వేరింగ్ కోట్స్ బలహీనమవుతాయి. బేరింగులు అరిగిపోతాయి. మెయిన్ గర్డర్స్ వంటి ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. ఉపరితలం వదులై బలహీనంగా మారుతుంది. స్తంభాల పైభాగాలు(పయర్ క్యాప్స్) తుప్పుపడతాయి. బాక్స్‌గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు వస్తాయి. కొన్ని పర్యాయాలు ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ కదలకుండా బిగుసుకుపోతాయి.
వాహనాల భారంతో ఇలాంటి సమస్యలు ఏర్పడటం సహజం. వీటిని సరిచేసేందుకు నిర్ణీత సమయాల్లో అవసరమైన మరమ్మతులు చేయాలి. కానీ, గ్రేటర్‌లో చాలా ఫ్లైఓవర్లు నిర్మించి 15 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కొన్నేళ్ల క్రితం ఖైరతాబాద్ ఆర్‌ఓబీపై కుదుపులు ఎక్కువ కావడంతో స్వల్ప మరమ్మతులు చేశారు. మళ్లీ ఇప్పుడు కుదుపులు ఎక్కువగా వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసాబ్‌ట్యాంక్, తెలుగుతల్లి, హఫీజ్‌పేట ఫ్లైఓవర్లపైనా సమస్యలు ఉన్నట్లు నగరవాసులు జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకొచ్చారు.
అధ్యయనంతో సరి..
ఏ సంస్థ నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలను ఆ సంస్థలే నిర్వహించాల్సి ఉండగా.. అన్నీ ఆ విషయమే మరిచాయి. జరగరానిదేదైనా జరిగితే స్థానిక సంస్థగా తమనే నిందిస్తారనే తలంపుతో జీహెచ్‌ఎంసీ నాలుగేళ్ల క్రితం ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీల స్ట్రక్చర్స్, జనరల్ కండిషన్లను తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఇన్వెంటరీ కమ్ కండిషన్ సర్వే బాధ్యతలను స్టుప్ కన్సల్టెంట్స్‌కు అప్పగించింది. సర్వే నిర్వహించిన సంస్థ ఖైరతాబాద్, లాలాపేట ఆర్‌ఓబీలు, మాసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీ నిర్ధారణకు సమగ్ర అధ్యయనం అవసరమని సూచించింది. దాంతో వాటి సమగ్ర సర్వే బాధ్యతను సివిల్–ఎయిడ్ టెక్నో క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. సర్వే నిర్వహించిన సదరు సంస్థ వాటి భద్రతకు పూర్తి భరోసా లేదని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాల్సిన అవసరముందని, తద్వారా వాటి జీవితకాలం పెరుగుతుందని సూచించింది. అయితే ఆ సూచనలు నేటికీ అమలు కాలేదు. దీంతో ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
స్ట్రక్చరల్ స్టెబిలిటీ అవసరం
ఏ నిర్మాణానికైనా నిర్ణీత సమయాల్లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరిశీలించాలి. పాత ఫ్లైఓవర్లలో ఎక్స్‌పాన్షన్ జాయింట్లు పాడయ్యే అవకాశం ఉంది. బేరింగులు పాడవడం వంటివి ఉంటాయి. పునాది చుట్టూ ఆప్రాన్ కట్టడం వంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తగిన నిర్వహణ ఉండాలి.
– ప్రొఫెసర్ ఎన్.రమణారావు, జేఎన్‌టీయూ
మరమ్మతులపై దృష్టి సారిస్తాం
కొన్ని ఫ్లైఓవర్లు జర్కులిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పరిశీలన జరిపి అవసరమైన మరమ్మతులు చేసే ఆలోచన ఉంది. మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించాలి. స్పాన్ల మరమ్మతులకు పది నుంచి ఇరవై రోజుల సమయం పడుతుంది. అవసరమైన ఫ్లైఓవర్లకు తగిన మరమ్మతులు చేస్తాం.
– జియావుద్దీన్, సీఈ, జీహెచ్‌ఎంసీ
జాగ్రత్తలు అవసరం
వానాకాలంలో వర్షాలకు ముందు తర్వాత ఫ్లైఓవర్లను పరిశీలించాలి. వాటి పరిస్థితి ఎలా ఉందో సరిచూసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో తగిన మరమ్మతులు చేయాలి.
– ఆర్.ధన్‌సింగ్, ఈఎన్‌సీ, ప్రజారోగ్య శాఖ
సూచనలు ఇవీ..
► మెయిన్ గర్డర్‌తోపాటు అన్ని గర్డర్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఉపరితలం వదులుగా ఉన్న భాగాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాలిమర్ మోడిఫైడ్ మోర్టార్‌తో మరోమారు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, లోపాలున్న చోట మైక్రోఫైన్ సిమెంట్‌తో నింపి సరిచేయాలి.
► బల్బ్, వెబ్ ప్రాంతాల్లో గుర్తించిన పగుళ్లను సరిచేసేందుకు లో వెలాసిటీ మానోమర్‌ను ఇంజెక్ట్ చేయాలి.
► తుప్పు కారణంగా దెబ్బతిన్న అడుగు భాగాలను, డయాఫ్రమ్ బీమ్స్‌ను పాలిమర్ మోడిఫైడ్ మోర్టార్‌తో పరీక్షించి గట్టిదనాన్ని అంచనా వేయాలి.
► కొన్ని స్తంభాల పైభాగాలు(పయర్‌క్యాప్స్) తుప్పుపట్టడం, పెచ్చులూడినందున శాండ్ బ్లాస్టింగ్ ద్వారా క్లీన్ చేయాలి.
► ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ దెబ్బతిన్నందున కంప్రెషన్ స్టీల్ జాయింట్స్ అమర్చాలి.
► కన్‌స్ట్రక్షన్ జాయింట్లలోని పగుళ్ల ప్రాంతాల్లో మైక్రోఫైన్ సిమెంట్‌తో గ్రౌటింగ్ చేయాలి.
► బాక్స్ గర్డర్ల మొదటి, చివరి కంపార్ట్‌మెంట్లలో నీటి నిల్వ ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ట్రీట్‌మెంట్ చేయాలి. అందుకుగానూ తగిన వాలు(స్లోప్)తో వాటర్ ప్రూఫ్ సిమెంట్ మోర్టార్‌తో ఉపరితలాన్ని నింపాలి.
► నీరు వెళ్లేందుకు వీలుగా అడుగుభాగంలో 50 మి.మీ. డయాతో రంధ్రాలు ఏర్పాటు చేయాలి.
► జాయింట్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ మెటీరియల్ చిప్ వేయాలి. కేంటిలివర్ బీమ్స్ వదులుగా ఉన్న ప్రాంతాల్లోనూ చిప్పింగ్ చేయాలి.
► గర్డర్లలో తిరిగి పగుళ్లు ఏర్పడే అవకాశాల్లేవని భావించినప్పటికీ నిర్ణీత వ్యవధుల్లో వాహన భారం(లోడ్) పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని కన్సల్టెంట్ సంస్థ నొక్కి చెప్పింది. పరీక్షల్లో ఫలితాల్ని బట్టి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
► కొన్ని ప్రాంతాల్లో.. మెయిన్ గర్డర్, బేరింగ్ ప్రాంతాల్లో హనీకోంబ్స్ (కాంక్రీట్ అంతటా సమంగా లేక డొల్లలు) ఏర్పడ్డాయి.
► స్లోప్డ్ వాల్స్, కన్‌స్ట్రక్షన్ జాయింట్ల నడుమ కాంక్రీటు నాణ్యత అనుమానాస్పదంగా మారింది.
లోపాలేమిటీ..?
వివిధ ఫ్లైఓవర్లు/ఆర్‌ఓబీల్లో దిగువ లోపాలున్నట్లు కన్సల్టెంట్ సంస్థ గుర్తించింది.
► పయర్‌క్యాప్స్‌లోని రీయిన్‌ఫోర్స్‌మెంట్ బార్స్ తుప్పుపట్టి దెబ్బతిన్నాయి.
► ఇంటీరియర్స్‌లో కాంక్రీట్ నాణ్యత దెబ్బతిన్న ప్రదేశాల్లో స్వల్ప పగుళ్లు ఉన్నాయి.
► కొన్నిచోట్ల నీరు సాఫీగా వెళ్లకుండా ఆటంకాలున్నట్లు అంచనా వేశారు.
► ఎక్స్‌పాన్షన్ జాయింట్స్, వేరింగ్‌కోట్స్ తగినంత బలంగా లేవు.