బ్రేక్..ఎటాక్..
►ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్
►పంజా విసిరేది ‘బ్రేక్’ సమయంలోనే
►ల్యాప్‌టాప్స్, హ్యాండ్‌బ్యాగ్స్ అపహరణ
►నిందితుడితో పాటు రిసీవర్లూ అరెస్టు
సిటీబ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలనే టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ చోరీలు చేస్తున్న నిందితుడిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. మార్కెటింగ్ ముసుగులో ఆఫీసుల్లోకి ప్రవేశించే ఇతను టీ, లంచ్ బ్రేక్‌ల్లోనే పంజా విసురుతాడని మధ్య మండల డీసీపీ డి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. నిందితుడి నుంచి 10 ల్యాప్‌టాప్స్, మూడు తులాల బంగారం, రూ.20.5 వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. టోలిచౌకీ ఎండీ లైన్స్‌కు చెందిన షేక్ ఇబ్రహీం వృత్తిరీత్యా అత్తర్ల వ్యాపారి. వివిధ కార్యాలయాలకు తిరుగుతూ సుగంధద్రవ్యాలు విక్రయించే ఇతను అదును చూసుకుని చోరీలు చేస్తుంటాడు. 2012లో రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్ళిన ఇబ్రహీంకు ఒక దాంట్లో శిక్ష కూడా పడింది. మళ్ళీ 2015 నుంచి పాత పంథానే అనుసరిస్తూ పంజా విసురుతున్నాడు.
‘బ్రేక్’లో ఎంట్రీ ఇస్తూ...
ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు టీ, లంచ్ బ్రేక్ సమయాల్లో కాస్త సేదతీరుతూ ఉంటారు. ఇదే సమయాన్ని ఇబ్రహీం తనకు అనువుగా మార్చుకున్నాడు. ఆయా వేళల్లో సుగంధద్రవ్యాలు అమ్మే నెపంతో ఆఫీసుల్లోకి వెళ్లి, అదును చూసుకుని అక్కడున్న ల్యాప్‌టాప్స్, మహిళల హ్యాండ్ బ్యాగ్స్ అపహరిస్తాడు. 2015 నుంచి ఇప్పటి వరకు అబిడ్స్, బేగంబజార్, సైఫాబాద్, హుమాయున్‌నగర్, పంజగుట్టల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 15 చోరీలు చేశాడు. చోరీ చేసిన తర్వాత బయటకు వచ్చే ఇతగాడు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా రెండుమూడు వాహనాలు మారుతూ ఇంటికి చేరుకుంటాడు చోరీ సొత్తును మల్లేపల్లి, టప్పాచబుత్ర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలకు విక్రయించేవాడు.
సీసీ కెమెరాల ఆధారంగా..
ఇబ్రహీం ఈ ఏడాది జనవరి 13న నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కార్యాలయంలోకి ప్రవేశించి, అసిస్టెంట్ కమిషనర్ అమరేష్‌కు చెందిన ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.గంగారామ్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, డిటెక్టివ్ ఎస్సై డి.నరేష్ దర్యాప్తు చేపట్టారు. ఆ కార్యాలయంలో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్, సాంకేతిక ఆధారాలను బట్టి ఇబ్రహీంను అతడి ఇంట్లో పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలను అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎవరిని పడితే వారిని రానీయకూడదని, వచ్చిపోయేప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని డీసీపీ జోయస్ సూచించారు.