హైదరాబాద్: భూ సేకరణలో అంతిమంగా ఆదివాసీల అసైన్డ్ భూములే టార్గెట్ అవుతున్నాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసూటికల్ కంపెనీలు మొదలుకొని ఏ అవసరానికి భూ సేకరణ చేసినా.. అక్కడ ఆదివాసీలకు ఇచ్చిన భూములను యథేచ్ఛగా గుంజుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలో గిరిజనులకు జరుగుతోన్న 'అన్యాయాలు - భవిష్యత్ కార్యాచరణ' అనే అంశంపై గిరిజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్ చౌహాన్ అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. అసైన్డ్ భూములంటే ఎప్పుడైనా గుంజుకోవచ్చనే ధోరణి సరికాదని ఆ భూమిని ఎవ్వరికీ అమ్మకూడదు, కొనకూడదనే నియమం తప్ప దానిపై ఇతర రైతులకున్నట్టే ఆదివాసీలకూ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
అడవుల పెంపకానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అడవుల పెంపకం పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో ఆదివాసీల హక్కులకు భంగం కలిగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచీలతో ఒక మాన్యువల్‌ని తయారు చేసిందని, దాన్ని అనుసరిస్తే తెలంగాణలో విషజ్వరాల నుంచి గిరిపుత్రులను కాపాడుకోగలుగుతామని చెప్పారు. తెలంగాణ గిరిజనుల సమస్యల పరిష్కారానికి జేఏసీ కార్యాచరణను తయారుచేస్తుందని తెలిపారు.