సాక్షి,సిటీబ్యూరో: తాజా ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారిలో ఎవరెవరు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులు కానున్నారనేది రాజకీయవర్గాల్లో.. జీహెచ్‌ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హాజరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. కొత్తగా ఎన్నికైన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్‌లు ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు.
టీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన కేకే కూడా గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యులు తాము ఏజిల్లాను ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో తగిన గౌరవం లభిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి వీరి లో ఎవరెరు జీహెచ్‌ంఎసీకి ఎక్స్‌అఫీషియో సభ్యులు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది.
కేకే,ఎంఏ ఖాన్‌లు తిరిగి జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులయ్యే అవకాశాలున్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. మిగతావారి గురించి చెప్పలేమంటున్నారు. హైదరాబాద్ జిల్లాను ఎంపిక చేసుకొని జీహెచ్‌ంఎసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతున్న వారిలో చిరంజీవి, జైరాంరమేశ్, నంది ఎల్లయ్య,వి.హనుమంతరావు,రాపోలు ఆనందభాస్కర్ , సీఎం రమేశ్‌లున్నారు.
గ్రేటర్ ‘పెద్ద’లెవరో..!
Published Sat, Feb 8 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement