ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
మోదీ, వెంకయ్య, బాబులపై కేసులు పెడతాం
వైఎస్ జగన్ ధర్నా హర్షణీయం
కాంగ్రెస్ పోరు సభలో రఘువీరారెడ్డి, చిరంజీవి వెల్లడి
11న రాష్ట్ర బంద్‌కు పిలుపు
తిరుపతి మంగళం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో శనివారం పోరు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చెబితే అలా కుదరదు కనీసం పదేళ్లయినా ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకపోవడం శోచనీయమని విమర్శించారు.
హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడతామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 11న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేపడుతుండడం హర్షణీయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.బలిదానాలతో కాకుండా పోరాటాలతో ప్రత్యేక హోదా సాధిద్దామని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన మునికోటి అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని చెప్పారు.సభలో కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.