
సాక్షి, హైదరాబాద్: విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర సాధించే వరకు రైతులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఏర్పాటైన రైతు సమన్వయ సమితులు పూర్తిస్థాయిలో కొలువుదీరనున్నాయి. సోమవారం రాష్ట్ర రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవ సాయ కమిషనరేట్‌లో కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు.
అక్కడే గుత్తాతోపాటు డైరెక్టర్లు బాధ్యతలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశముందని చెబుతున్నా ఆయన రాకపై స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు. పలువురు మంత్రులు రానున్నారు. కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా, మండల రైతు సమన్వయకర్తలను వ్యవసాయ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్ ఆహ్వానించారు. రాష్ట్ర రైతు సమితుల్లో మొత్తం 1.61 లక్షల మంది సభ్యులున్నారు.
గ్రామస్థాయిలో 15, మండల, జిల్లాస్థాయిల్లో 24 మంది సభ్యుల చొప్పున సమితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయిలో 42 మందితో సమితి ఏర్పాటు కానుంది. కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల మూలనిధిని కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ మేరకు ముందుగా రూ.200 కోట్లు అందజేశారు.