కట్టలు, అలుగులపై దృష్టిపెట్టాలి
* చెరువుల పునరుద్ధరణపై నీటి పారుదల
* నిపుణుడు హనుమంతరావు సూచన
* చెరువుల్లో పూడిక కంటే ముందు కట్టల బలోపేతం, అలుగు విస్తరణ తప్పనిసరి
* ఇప్పటికే తెగిపోయిన 1,700 చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలి
* చెరువులకు నీరు వచ్చే కాలువలు, వాగుల్లో పూడిక తీత వద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అభినందనీయమని... అయితే ముందుగా చెరువుల్లో పూడిక తీయడం కాకుండా వాటి కట్టల భద్రత, అలుగు (మత్తడి) విస్తరణ చేపట్టాలని ప్రముఖ నీటి పారుదల నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్‌సీ టి.హనుమంతరావు సూచించారు. భారీ వర్షాల సమయంలో చెరువుల కట్టలు తెగి, నీరు నిల్వ ఉండ టం లేదని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికే 1,700 చెరువుల కట్టలు తెగిపోయి వృథాగా ఉన్నాయని.. వాటిని యుద్ధప్రతిపాదికన మరమ్మతు చేయాలని పేర్కొన్నారు.
పదేళ్ల వరదను దృష్టిలో ఉంచుకోవాలి..
పదేళ్లపాటు ఆ చెరువులకు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని, ఆయా ప్రాంతాల నేల స్వ భావం ఆధారంగా పనులు చేపట్టాలని హనుమంతరావు సూచించారు. చెరువుల పూడికతీత కార్యక్రమం సాధారణంగా తూముల వద్ద ఎక్కువగా జరుగుతుందని, తూముల వద్ద పూడిక తీయడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. దీనివల్ల అక్కడ తూములుపైకి ఉండి, చెరువులోతుగా ఉంటే.. నీరు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్నారు.
త్వరగా నిండే వాటికి ప్రాధాన్యత..
చెరువుల్లో నీరు నిండుగా ఉన్నప్పుడు వాటి కట్టలు తెగకుండా ఉండాలంటే... వాటి భద్రత సామర్థ్యాన్ని పెంచి, ఏటవాలుగా ఏర్పాటు చేయాలని, అలుగు విస్తీర్ణం కూడా పెంచాల్సి ఉంటుందని హనుమంతరావు తెలిపారు. వర్షాలతో త్వరగా నిండే చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని... భారీ వర్షాలు వచ్చినా నిండని చెరువుల్లో పూడికతీసే కార్యక్రమంతో ప్రయోజనం ఉండదని చెప్పారు. చెరువులకు సంబంధించి తాను రాసిన ‘చిన్న నీటిపారుదల సాంకేతిక మార్గదర్శకాలు (మైనర్ ఇరిగేషన్ టెక్నికల్ గైడ్‌లైన్స్)’ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చెరువుల్లోకి నీరు చేరే కాలువలు, వాగుల్లో పూడిక, చెట్లను కొట్టేయడం వల్ల నీరు వేగంగా వచ్చి చెరువుల్లో చేరుతుందని... కానీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు చేరకుండా పోయే అవకాశముంటుందని హనుమంతరావు చెప్పారు. కాలువలు, వాగుల్లో పూడిక తీయకుంటే... వర్షం నీరు కాస్త ఆలస్యంగా వచ్చినా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
గరిష్ట నీటి మట్టం వద్ద...
పట్టణాలు, నగరాల్లో చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) వద్ద కంచె నిర్మాణం చేస్తున్నారని, అలా కాకుండా గరిష్ట నీటిమట్టం (ఎంటీఎల్) వద్ద కంచె వేయడం మంచిదని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. చెరువుల చుట్టుపక్కల ఇళ్లు నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వర్షాలు పడినప్పుడు ఆ ఇళ్లన్నీ ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల గరిష్ట స్థాయి నీటి మట్టం వద్ద కంచె నిర్మాణం చేపడితే.. దాని లోపల ఇళ్ల నిర్మాణం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.
పునరుద్ధరణకు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలు!
భారీ ఎత్తున చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజనీర్ల సహకారం తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్న సెక్షన్ కార్యాలయాల పరిధిలో సుమారు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి... ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మండల స్థాయిలో చెరువు పనుల అంచనాలు, పనుల పర్యవేక్షణ, పనుల సర్వే తదితర బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని తెలిపాయి.