జాతీయ జనాభా పట్టిక ఆధారంగా జారీకి కేంద్రం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టికలోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది.
జాతీయ జనాభా పట్టిక రూపకల్పనపై గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ భేటీకి హాజరయ్యారు. సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇస్తారు. వాటిని పరిష్కరించి తుది జాతీయ జనాభా పట్టిక తయారుచేస్తారు. దీని ఆధారంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తారు. ఈ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు.