
హీరో మహేష్‌బాబును కలిపిస్తామని టోకరా
బంజారాహిల్స్ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు
బంజారాహిల్స్: సినీ హీరో మహేష్‌బాబును కలిపిస్తానని నమ్మించి మోసం చేసిన అపరిచితుడిపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన ప్రేమ్‌రాజ్ రైతు. మూడు నెలల క్రితం ఆయనకు గుండెకు రంధ్రంతో కూతురు పుట్టింది. చికిత్స నిమిత్తం నగరంలోని స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సినిమా కథలు, పాటులు రాసే అలవాటున్న ప్రేమ్‌రాజ్ తాను నగరంలోనే ఉండటంతో హీరో మహేష్‌బాబుకు తన పాటలు, కథలు వినిపిద్దామనుకున్నాడు. ఆయనను కలవడానికి ఉన్న మార్గాలపై గూగుల్ సెర్చ్ చేయగా... అందులో మహేశ్‌ను కలిపిస్తామని ఒక ఫోన్ నెంబర్ కనిపించింది.
ఆ నెంబర్‌కు ఫోన్‌కు చేయగా.. రూ. 10 వేలు ఖర్చు అవుతుందని, అడ్వాన్స్ కింద రూ. 5 వేలు తన ఖాతాలో వేయాలని సదరు వ్యక్తి ప్రేమ్‌రాజ్‌కు చెప్పాడు. మహేశ్‌కు కథ వినిపించే అవకాశమే కల్పించడమే కాకుండా ఆయనతో నీ కూతురి వైద్యానికి ఖర్చులు కూడా ఇప్పిస్తానని నమ్మబలి కాడు. దీంతో ప్రేమ్‌రాజ్ గతనెల 30న ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ. 5 వేలు జమ చేశాడు. తీరా ఈనెల 1న ఆ వ్వక్తికి మళ్లీ ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మూడు రోజులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఐపీసీ 120 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.