హైదరాబాద్ : పళ్లను త్వరగా పక్వానికి తీసుకొచ్చేందుకు వ్యాపారులు వాడే కార్బైడ్.. అసలు వారికి ఎలా లభ్యమవుతోందో తేల్చాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. కార్బైడ్ లభ్యం కాకుండా చూస్తే తప్ప, దాని వినియోగాన్ని అరికట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కార్బైడ్ రవాణా చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలంది. ఈ దిశగా తగిన చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల (ఎఫ్‌ఎస్‌ఓ) పోస్టుల భర్తీకి తగిన చర్యలు చేపట్టడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది.
ఈ విషయంలో సర్కార్ తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఆక్షేపించింది. ఎఫ్‌ఎస్‌ఓల ఖాళీలను భర్తీ చేస్తామని గతంలో తమకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఎందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదో వివరించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు గాను వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని వ్యక్తిగత హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు కార్బైడ్ ఎలా దొరుకుతోంది?- హైకోర్టు
Published Mon, Jun 6 2016 8:29 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement