రైలు బోగీల్లో అపరిశుభ్రతపై హైకోర్టు ఆగ్రహం
- ఫస్ట్ క్లాస్ బోగీల్లోనూ ఎలుకలు
- టాయిలెట్స్ మరీ దారుణమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీలు, ప్లాట్‌ఫాంల అపరిశుభ్రతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫస్ట్‌క్లాస్ బోగీల్లో ఎలుకలు కూడా సంచరిస్తుండటంపై విస్మయం చెందింది. విశాఖ రైల్వే ప్లాట్‌ఫాంలో కాంట్రాక్టు వివాదంపై దాఖలైన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. బిచ్చగాళ్లు, అనాథలు రైలు బోగీలు శుభ్రం చేసి ప్రయాణికుల నుంచి డబ్బు ఇవ్వమని వేడుకోవడం తాము కూడా చూశామని, మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనలవి కాదని, వీటిని చక్కదిద్దాల్సిన సిబ్బంది ఏంచేస్తున్నారని రైల్వే అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఆహార పదార్థాల విక్రయానికి మహదేవ్ సేల్స్ ఏజెన్సీ కాంట్రాక్టు పొందింది.
ప్రయాణికులు తిని వదిలేసిన ప్లేట్లను సదరు ఏజన్సీ సేకరించి తిరిగి వినియోగించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో రైల్వే అధికారులు స్పందించారు. సదరు కాంట్రాక్టు లైసెన్స్ రద్దు చేస్తూ, రూ.లక్ష జరిమానా విధించారు. దీనిపై మహదేవ్ సేల్స్ ఏజన్సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో రూ.లక్ష జరిమానా విధించినప్పుడు లైసెన్స్ రద్దు చేయడం సరికాదంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రైల్వే అధికారులు అప్పీల్ చేశారు. తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రైళ్లల్లో అపరిశుభ్రతపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంట్రాక్టు లైసెన్స్ రద్దు ఉత్తర్వుల్ని సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడాన్ని కొట్టివేసింది. రైల్వేతో ఒప్పందంపై అభ్యంతరాలు ఉంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలంది.