గంట ముందే పరీక్ష హాల్లోకి
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అనుమతించాలని నిర్ణయం
♦ పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి కడియం శ్రీహరి సమీక్ష
♦ పరీక్ష సమయం దాటిన 5 నిమిషాల వరకూ అనుమతి
♦ ఈ నెల 21 నుంచి పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
♦ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కడియం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 21వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల ఏర్పాట్లపై విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌తో కలసి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులను ఉదయం 8:45 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని గతంలో ఉత్తర్వులు జారీ చేసినా, ఉదయం 8:30 గంటల నుంచే అనుమతించాలని స్పష్టం చేశారు.
పరీక్షల కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రా ల వద్ద వేచి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే విద్యార్థులను అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లోనూ 8:30 గంటల నుంచే పిల్లలను పరీక్ష హాల్లోకి పంపించాలని స్పష్టం చేశారు. పరీక్ష సమయం దాటిన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించాలన్నారు.
మెడికల్ సిబ్బందికి రెమ్యూనరేషన్..
పరీక్ష విధులకు హాజరయ్యే మెడికల్ సిబ్బంది రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మెడికల్ సిబ్బందికి రెమ్యునరేషన్ ఇవ్వాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లు రూపొందించి పంపాలని ఆదేశించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రైవేటు స్కూళ్లు, ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సెల్ప్ సెంటర్లు, సమస్యాత్మక కేంద్రాలు, కాంపౌండ్ గోడలు లేని స్కూళ్లలో డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు సిబ్బందిలో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్‌లో 34 సెల్ప్ సెంటర్ల ను ఏర్పాటు చేయడం అవసరమా లేదా అన్న దానిపై ఆర్‌డీవోలను క్షేత్రస్థాయికి పంపించి, ప రిశీలించి నిర్ణ యం తీసుకోవాలని వరంగల్ కలెక్టర్‌ను ఆదేశించారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ఈ నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు కీలకమైనవని, వెయిటేజీతో ముడిపడిన సబ్జెక్టులు కావడంతో వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలన్నారు. జిల్లాల్లో ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమీక్షించి, మాస్ కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ఫర్నీచర్ సమస్య ఉన్న కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశించారు. టాయిలెట్లకు నీటి వసతి లేకపోతే ముందే ట్యాంకర్ల ద్వారా తెప్పించి అందుబాటులో ఉంచాలన్నారు.
అన్ని కేంద్రాల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు చెందిన వారిని వాటర్ బాయ్స్‌గా నియమించవద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆదేశించారు. గతంలో వాటర్ బాయ్స్ పేరుతో కేంద్రంలోకి వచ్చిన వారు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసి బయటకు పంపించిన దాఖ లాలు ఉన్నాయని గుర్తుచేశారు. వృద్ధులను, నిరక్షరాస్యులు మాత్రమే నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని పేరొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎవరూ సెల్‌ఫోన్లు వాడటానికి వీల్లేదని, చీఫ్ సూపరింటెండెంట్లు కూడా కెమెరాలు లేని సెల్ ఫోన్లనే వినియోగించాలని స్పష్టం చేశారు. పరీక్షలతో సంబంధంలేని వారిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు.