ఈసీ పొందడం ఇలా.. | how to get the encumbrance certificate | Sakshi
Sakshi News home page

ఈసీ పొందడం ఇలా..

Published Sun, Jul 13 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

ఈసీ పొందడం ఇలా..

ఈసీ పొందడం ఇలా..

ఒక స్థలం.. పొలం.. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది.. గతంలో దానిపై జరిగిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను ఈసీ తెలుపుతుంది.

ఈసీ.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్. స్థిరాస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంతటి కీలకమైన పత్రం కోసం తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవాలి.
 - గాజులరామారం

 
ప్రయోజనం..
ఒక స్థలం.. పొలం.. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది.. గతంలో దానిపై జరిగిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను ఈసీ తెలుపుతుంది.
 ప్రాపర్టీ ఓనర్‌షిప్ కన్‌ఫర్‌మేషన్, బ్యాంక్ లోన్ కావాలంటే, మార్ట్‌గేజ్ వివరాలు తదితర సమాచారం కోసం ఇది తప్పని సరి.
ఈ సర్టిఫికెట్‌ను ‘మీ-సేవ’ ద్వారా సంబంధిత ప్రాంతీయ సబ్ రిజిస్ట్రార్ జారీ చేస్తారు.ఇది పొందేందుకు ముందుగా దగ్గరలోని ‘మీ- సేవ’ కార్యాలయానికి వెళ్లి ప్రాపర్టీ దస్తావేజుల నకలు లేదా రిజిస్ట్రేషన్ నంబరు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్‌ఆర్‌ఓ) పేరు, దరఖాస్తుదారుడి పేరు వివరాలతో పాటు నిర్దేశిత రుసుం రూ. 225 చెల్లించి, మీ ప్లాటు/ ఫ్లాటు వివరాలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందాలనుకుంటే రూ.220 చెల్లించాలి.
 
ఈ జాగ్రత్తలు తప్పని సరి..
ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా లిఖించాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నెంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు.
 
ఇక్కడే తప్పు చేస్తారు..
చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాల్ని అందజేస్తుంది. అందుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే.
 
గమనిక: ఏదైనా ప్రాంత సబ్  రిజిస్ట్రార్ కార్యాలయం మారినా, విడిపోయినా పూర్తి వివరాల కోసం విడివిడిగా రెండిటికి దరఖాస్తు చేయాలి. ఉదా: 2007లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పడింది. అంతకు ముందు మేడ్చల్‌లోని కార్యాలయంలోనే ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్లులు జరిగేవి. కుత్బుల్లాపూర్‌వాసులు 2007కు ముందు వివరాలు కావాలంటే రెండు ఈసీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇదే నిబంధన అన్ని ప్రాంతాలవారికి వర్తిస్తుంది.
 
సెర్చ్ ఈసీ..
1983 సంవత్సరానికి ముందు స్థిరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోళ్ల వివరాలు కావాలంటే సెర్చ్ ఈసీ తీసుకోవాలి. ఇందుకోసం రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ వివరాలను లిఖిత పూర్వకంగా సబ్ రిజిస్ట్రార్ జారీ చేస్తారు. మీ-సేవలో 1983 సంవత్సరం తర్వాత జరిగిన స్థిరాస్తుల క్రయవిక్రయాల వివరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement