తప్పిన తిప్పలు
మహానగర సిటీజనులకు శుభవార్త. సోమవారం నుంచి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల వంటగ్యాస్ గృహ వినియోగదారులకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా కానుంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం రద్దు కావడంతో.. నాన్ సబ్సిడీపై సిలిండర్ కొనుగోలు చేసే బాధ తప్పినట్లయింది.
గృహ వినియోగదారులందరికీ పాత పద్ధతిలోనే సబ్సిడీ ధరకే వంటగ్యాస్ సిలిండర్లను అందించాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి వంటగ్యాస్ డీలర్లకు ఆదేశాలు అందడంతో సోమవారం నుంచి సబ్సిడీ ధర (ప్రస్తుతం రూ. 441) పైనే సిలిండర్ల సరఫరా అమలు కానుంది. వాస్తవంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసింది.
అయితే నగదు బదిలీ విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తిరిగి పాత పద్ధతిలో మార్పు చేసి సబ్సిడీ ధర బిల్లింగ్‌తో సిలిండర్లను సరఫరా చేసేందుకు కాస్త సమయం పట్టింది. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలైన ఇండేన్, భారత్, హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ల మార్పు పక్రియ దాదాపు పూర్తవడంతో 10వ తేదీ నుంచి పాత విధానంలో సబ్సిడీ ధరపై బిల్లింగ్ చేసి నేరుగా వినియోగదారులకు సిలిండర్లు అందించాలని డీలర్లకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం నుంచి పాతపద్ధతిలో బిల్లింగ్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది.
వంటగ్యాస్‌కు విముక్తి
డీబీటీ అమలుతో డొమెస్టిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సిలిం డర్ ధర సైతం నిలకడగా లేకుండా పై పైకి ఏగబాకింది. ఎల్పీజీ కనె క్షన్లను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము పడకపోవడం తదితర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు వంటగ్యాస్‌కు సబ్సిడీ నగదు బదిలీ నుంచి విముక్తి లభించింది.