సాక్షి, సిటీబ్యూరో
అసంపూర్తిగా మిగిలిన, కనీస సదుపాయాలు కల్పించాల్సిన జేఎన్ఎన్ యూఆర్‌ఎం, వాంబే ఇళ్లలో సదరు సదుపాయాలు పూర్తిచేసేందుకు హడ్కోనుంచి రూ. 338.72 కోట్లు రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అనుమతినిచ్చింది. ఈమేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీఓ జారీ చేసింది. వాంబే, జేఎన్ఎ యూఆర్‌ఎం పథకాల కింద నిర్మించిన ఇళ్లలో 24,648 ఇళ్లకు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకుగాను దాదాపు రూ. 448.42 కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. అందులో లబ్ధిదారుల కంట్రిబ్యూషన్ పోను రూ.338.72 కోట్ల రుణానికి ప్రభుత్వం అనుమతించింది. జీహెచ్‌ఎంసీ గ్యారంటీ కమిషన్ గా 2శాతం నిధుల్ని ప్రభుత్వం వద్ద ఉంచాలని స్పష్టం చేసింది. అవసరాన్ని బట్టి దశలవారీగా ఈ రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన గ్యారంటీనివ్వనుంది.