‘హుజీ’పై పట్టుబిగిస్తున్న ఎన్‌ఐఏ | 'Huji' On attaracted to NIA | Sakshi
Sakshi News home page

‘హుజీ’పై పట్టుబిగిస్తున్న ఎన్‌ఐఏ

Published Mon, Oct 19 2015 2:04 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

‘హుజీ’పై పట్టుబిగిస్తున్న ఎన్‌ఐఏ - Sakshi

‘హుజీ’పై పట్టుబిగిస్తున్న ఎన్‌ఐఏ

బెంగళూరు కుట్ర కేసులో వాంటెడ్‌గా ఉన్న హైదరాబాదీ అసద్ ఖాన్‌ను సౌదీ అరేబియా ఏజెన్సీలు అదుపులోకి తీసుకునేలా చేయడంలో సఫలీకృతం కావడంతో...

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు కుట్ర కేసులో వాంటెడ్‌గా ఉన్న హైదరాబాదీ అసద్ ఖాన్‌ను సౌదీ అరేబియా ఏజెన్సీలు అదుపులోకి తీసుకునేలా చేయడంలో సఫలీకృతం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామీ (హుజీ)పై పట్టు బిగిస్తోంది. బెంగళూరు కుట్ర కేసులో వాంటెడ్‌గా ఉండి రియాద్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో తలదాచుకున్న మిగిలిన నిందితుల కోసం వేట ముమ్మరం చేసింది. వీరిలో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కొందరు ఉగ్రవాదులపై ఇక్కడా కేసులు నమోదై, వాంటెడ్‌గా ఉన్నారు.

బెంగళూరు పోలీసులు 2012 ఆగస్టు 29న ఈ కుట్రను ఛేదించారు. సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల్లో తలదాచుకున్న లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామీ (హుజీ)కి సపోర్ట్ చేస్తూ దీనికి వ్యూహరచన చేశారు. తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రల్లో ఉన్న క్యాడర్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, నాందేడ్ ల్లో ఉన్న ఓ వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, జర్నలిస్టుల్ని టార్గెట్ చేశారు.

మత కలహాలు సృష్టించడమే ధ్యేయంగా సౌదీ అరేబియా, రియాద్‌ల్లోనే ఈ కుట్ర మొత్తం ఊపిరిపోసుకుందని ఎన్‌ఐఏ తేల్చింది. హత్యలతో పాటు దోపిడీలు, బందిపోటు దొంగతనాలు చేయడం ద్వారా ‘మాల్-ఇ-ఘనీమట్’ (యుద్ధానికి అవసరమైన నిధులు) సమీకరించడానికీ వీరు కుట్రపన్నారన్నది ఎన్‌ఐఏ అభియోగం. ఈ కేసులో వాంటెడ్‌గా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న వారిని పట్టుకోవడానికీ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా చర్యలు ముమ్మరం చేసింది. ఈ కుట్రలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురి పాత్రను ఎన్‌ఐఏ నిర్థారించింది.

వీరిలో ఒబేదుర్ రెహ్మాన్ ఇప్పటికే అరెస్టు కాగా... అసద్ ఖాన్ అలియాస్ అబు సూఫియాన్‌ను సౌదీ అరేబియా ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఈ ఐదుగురిలో ఇక్కడ నమోదైన కేసుల్లోనూ వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు ఉన్నారు. బెంగళూరు కేసులో 16వ నిందితుడిగా ఉన్న మహ్మద్ భాయ్ అలియాస్ అబ్దుల్ మరీమ్ అలియాస్ అబ్దుల్ బారీ అలియాస్ అబు హంజా, 19వ నిందితుడిగా ఉన్న మహ్మద్ అబ్దుల్ మజీద్, 20వ నిందితుడిగా ఉన్న అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ ఫర్హాతుల్లా ఘోరీ, 23వ నిందితుడిగా ఉన్న సాదిఖ్ బిన్ ఉస్మాన్ అలియాస్ అబు హంజాలా అలియాస్ సాబేర్, 26వ నిందితుడిగా ఉన్న ఫుర్ఖాన్ భాయ్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ మసూద్ అలియాస్ అబు సాద్‌లపై హైదరాబాద్‌ల్లోనూ కేసులున్నాయి.

వీరు బెంగళూరు మాడ్యుల్‌కి ఆర్థిక, స్థానిక, శిక్షణ సహకారాలు అందించారనేది ఆరోపణ. ఈ ఐదుగురూ హైదరాబాద్‌కు సంబంధించిన ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా  ఆలయం వద్ద పేలుడు, సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ పేల్చివేత కుట్ర తదితర కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఎన్‌ఐఏ అధికారులు వీరిని కూడా బెంగళూరు కేసులో దేశానికి రప్పించగలిగితే హైదరాబాద్ కేసుల్లోనూ అరెస్టు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement