
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి పరాభవం కలిగింది. ఆయన రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు అవుతారని నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అంతర్గతంగా సీఎం కేసీఆర్ కూడా హామీయిచ్చారు. ఇటీవల జిల్లా రైతు సమితి సమన్వయకర్తల జాబితాను సీఎం ఖరారు చేశారు. వాటి ఖరారుకు ముందే నల్లగొండ జిల్లా సమితి సమన్వయకర్తలుగా తన అనుచరులైన ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, పాశం రామిరెడ్డిలలో ఎవరో ఒకరికి ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదించారు.
ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. అయితే వ్యవసాయ శాఖ వర్గాలు ఇప్పటివరకు ముఖ్యమంత్రికి లేఖను పంపలేదని సమాచారం. మంత్రి ద్వారా ఆ లేఖ సీఎంకు పంపారా, లేదా, అనే దానిపై స్పష్టత లేదు. జిల్లా స్థాయిలో మంత్రి జగదీశ్‌రెడ్డి విన్నపానికి మంత్రి పోచారం సంసిద్ధత వ్యక్తంచేసి ఆయన అనుచరుడికి అవకాశం కల్పించారని అంటున్నారు. విచిత్రమేంటంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించిన ఇద్దరిలో ఎవరికీ కనీసం జిల్లా సమన్వయ సమితిలో సభ్యుడిగా కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో ఎక్కువ మంది సమన్వయకర్తలు తన సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని చెబుతూ వీరిని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతున్నా, జిల్లా సమితిలోనూ సభ్యులుగా తీసుకోకపోవడంపై గుత్తా మనస్తాపం చెందినట్లు సమాచారం. దీనిపై గుత్తా ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ఎక్కువ మంది మా సామాజిక వర్గానికి చెందినవారే జిల్లా సమన్వయకర్తలుగా ఉన్నారని, దీంతో నల్లగొండ జిల్లాలో మరో సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చామని నాతో చెప్పారు’అని వివరించారు.