‘న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
పంజగుట్ట: పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిన భర్తను వెంటనే నగరానికి రప్పించి తనకు న్యాయం చేయాలని ఓ యువతి కోరింది. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాధితురాలు సంగెపు ప్రశాంతి సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓ మ్యాట్రీమొని ద్వారా యూకేలో ఉద్యోగం చేస్తున్న శ్రవణ్‌తో పరిచయం ఏర్పడి ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పింది. అయితే, శ్రవణ్ తమ తల్లిదండ్రులకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి, యూకె నుంచి నగరానికి వచ్చి గతేడాది ఆగస్టు 8న వరంగల్ జిల్లాలోని ఎర్రగట్టు ఆలయంలో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.
అనంతరం ఎల్‌బీ నగర్‌లోని శ్రవణ్ ఇంటికి వెళ్లగా రెండు రోజులు బాగానే చూసుకున్నారని, తర్వాత తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారని తెలిపింది. ఆ తర్వాత తనను పుట్టింటికి పంపించి, శ్రవణ్‌కు తనపై లేనిపోనివి చెప్పి యూకెకు పంపేశారని ప్రశాంతి పేర్కొంది. అనంతరం తాను అత్తగారింటికి, శ్రవణ్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదని, ఇంటికి వెళ్తే తిట్టి పంపేశారని, భర్త శ్రవణ్ కూడా ఫోన్ చేసి దిక్కున్న చోట చెప్పుకోమని తిట్టాడని తెలిపింది.
తాను వరంగల్ మట్టెవాడ పోలీసులను, వరంగల్ పోలీసులను కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తాను పోలీసులపై తీవ్ర ఒత్తిడితేగా 14 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, కాని ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని బాధితురాలు పేర్కొంది. వెంటనే తన భర్తను తన వద్దకు రప్పించాలని, తనను వేధించిన వారిని శిక్షించాలని కోరింది. తనకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.