సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందే చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ర్పచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పొలిటిక్ పంచ్ పేరుతో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న సోషల్ మీడియా వాలెంటీర్ ఇంటూరి రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్‌పై పోలీసులు రవికిరణ్ కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో అతని భార్య సుజన ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున 3.30గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా సోషల్ మీడియతో పాటు వెబ్ సైట్లలో టీడీపీ పార్టీ, ఏపీ సర్కార్‌పై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోషల్ నెట్‌వర్క్‌లో నెగిటివ్ క్యాంపెయిన్‌పై చట్టప్రకారం యాక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది.
సోషల్‌మీడియాపై కట్టడి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది. ఫేస్‌బుక్‌లోని కొన్ని పేజీలు, వెబ్‌సైట్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ బృందం సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది.