గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులపై నిషేధం విధించాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల నియామలికి విరుద్దంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా... ఎన్నికల పరిశీలకులకు వినపడటం లేదా అని అడిగారు.
గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాత నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి ఆదరాభిమానాలు పొందుతుంటంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పిచ్చికుక్కలా మెరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసిఫ్‌నగర్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించారు.
కొంత కాలంగా ఎంఐఎం నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? అని అడిగారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వారే చూసుకుంటారన్నారు. ఎన్నికల నియామావలి 243-కె, 243 జెడ్‌ఏ ప్రకారం ఎంఐఎం నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను పాతబస్తీ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు.