నగర ప్రథమ పౌరుడెవరో... | who is the mayor of ghmc? | Sakshi
Sakshi News home page

నగర ప్రథమ పౌరుడెవరో...

Published Tue, Feb 9 2016 3:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నగర ప్రథమ పౌరుడెవరో... - Sakshi

నగర ప్రథమ పౌరుడెవరో...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు. ఇప్పుడు అందరి నోళ్లలో దీనిపైనే చర్చ. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు సాగుతున్నా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నగర ప్రథమ పౌరుడు ఎవరవుతారన్న విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 11 వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరోజున మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు నుంచే గ్రేటర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీ వ్యూహంతో పనిచేసింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచన చేసినట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. అదీ సాధ్యం కాని పరిస్థితి ఉంటే హైదరాబాద్ మున్సిపల్ (స్థానిక సంస్థ) లో ఎక్స్ అఫిషియే సభ్యుల ద్వారా మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించింది.

అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ దక్కడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే మేయర్ సీటును దక్కించుకోనుంది. ఎంఐఎంను మిత్రపక్షం చేసుకుని మేయర్ స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి తలెత్తి ఉంటే మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒకరకమైన వ్యూహం, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా అవసరమైన పరిస్థితి ఏర్పడి ఉంటే మరో రకమైన వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పుడు ఇతరుల మద్దతు అవసరం లేకుండానే స్వతంత్రంగా అభ్యర్థిని ఎంపిక చేసుకునే బలం సమకూరడంతో ఆ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయం ఆ ఎన్నిక రోజు వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే రోజున ఉన్న పరిస్థితి ఇప్పుడు లేనందున మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక పూర్తిగా కేసీఆర్ ఆలోచనను బట్టే ఉంటుంది.

మేయర్గా రామ్మోహన్
మేయర్ పదవికి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్మోహన్ కార్పొరేటర్ గా పోటీ పెట్టిన సందర్భంగానే ఆయన పేరు మేయర్ పదవి ఇస్తామని సూత్రప్రాయంగా పార్టీ నాయకత్వం తెలిపిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్ పదవి ఎంపిక కోసం ఎంఐఎం మద్దతు తీసుకోవలసిన అవసరం ఏర్పడి ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కు ఇచ్చే పరిస్థితి తలెత్తేది. ఇప్పుడా పరిస్థితి లేనందున డిప్యూటీ మేయర్ పదవి కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికైన కార్పొరేటర్లలో ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని తెలుస్తోంది.

ఏ లెక్క చూసినా...
మేయర్ పీఠం దక్కించుకోవడానికి గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులను పరిగణలోకి తీసుకోకుంటే... 76 డివిజన్లు ఉంటే సరిపోతుంది. అయితే టీఆర్ఎస్ అనూహ్యంగా 99 డివిజన్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 150 మంది డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా మరో 67 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఉంది.

లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, వారిలో టీఆర్ఎస్ కు 35, ఎంఐఎంకు 10, టీడీపీకి 7, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 7 ఓట్లున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్ కు 34 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ తాజాగా మంగళవారం టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 35 కు పెరిగింది. మొత్తం 150 డివిజన్లతో పాటు 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 217 మంది ఓటర్లలో  134 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్క తీసుకున్నా టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోగలదు.

లోక్ సభ సభ్యులు
1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్)
2. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ)
3. బండారు దత్తాత్రేయ (బీజేపీ)
4. అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం)

రాజ్యసభ సభ్యులు
5. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్)
6. వి. హనుమంతరావు (కాంగ్రెస్)
7. రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్)
8. సీఎం రమేష్ (టీడీపీ)
9. గరికపాటి మోహన్ రావు (టీడీపీ)
10. కే కేశవరావు (టీఆర్ఎస్)
11. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్)
12. జైరాం రమేష్ (కాంగ్రెస్)
13. ఎం.ఏ. ఖాన్ (కాంగ్రెస్)
14. కె. చిరంజీవి (కాంగ్రెస్)

ఎమ్మెల్సీలు
15. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)
16. కే. యాదవ రెడ్డి (టీఆర్ఎస్)
17. ఎస్. రాములు నాయక్ (టీఆర్ఎస్)
18. కె. స్వామిగౌడ్ (టీఆర్ఎస్)
19. మహమ్మద్ సలీమ్ (టీఆర్ఎస్)
20. నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్)
21. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ఎస్)
22. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్)
23. వి.భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
24. సుంకరి రాజు (టీఆర్ఎస్)
25. కె.జనార్థన్ రెడ్డి (టీఆర్ఎస్)
26. ఆర్ భూపతి రెడ్డి (టీఆర్ఎస్)
27. పి.సతీష్ కుమార్ (టీఆర్ఎస్)
28. కర్నె ప్రభాకర్ (టీఆర్ఎస్)
29. వి.గంగాధర్ గౌడ్ (టీఆర్ఎస్)
30. డి.రాజేశ్వరరావు (టీఆర్ఎస్)
31. పి.రవీందర్ (టీఆర్ఎస్)
32. కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్ఎస్)
33. బి.వెంకటేశ్వర్లు (టీఆర్ఎస్)
34. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్)
35. నేతి విద్యాసాగర్ (టీఆర్ఎస్)
36. పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
37. టి.భాను ప్రసాద్ (టీఆర్ఎస్)
38. నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్)
39. ఎంఎస్ ప్రభాకర్ (కాంగ్రెస్ - టీఆర్ఎస్ లో చేరారు)
40. మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)
41. సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం)
42. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం)
43. ఎన్. రామచందర్ రావు (బీజేపీ)

ఎమ్మెల్యేలు
44. కె. లక్ష్మణ్ (బీజేపీ)
45. జి. కిషన్ రెడ్డి (బీజేపీ)
46. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ)
47. టి. రాజాసింగ్ (బీజేపీ)
48. ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ)
49. మాగంటి గోపీనాధ్ (టీడీపీ)
50. కేపీ వివేకానంద (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు)
51. ఆర్ కృష్ణయ్య (టీడీపీ)
52. టి. ప్రకాశ్ గౌడ్ (టీడీపీ)
53. అరికెపూడి గాంధీ (టీడీపీ)
54. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
55. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎంఐఎం)
56. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం)
57. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం)
58. అక్బరుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం)
59. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం)
60. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం)
61. టి.పద్మారావు (టీఆర్ఎస్)
62. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
63. చింతల కనకా రెడ్డి (టీఆర్ఎస్)
64. తలసాని శ్రీనివాస యాదవ్ (టీడీపీ- టీఆర్ఎస్ లో చేరారు)
65. జి. సాయన్న (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు)
66. ఎం. కృష్ణారావు (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు)
67. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ఎస్ - నామినేటెడ్ మెంబర్)

పార్టీ  కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో
సభ్యులు
మొత్తం
టీఆర్ఎస్ 99 35 134
ఎంఐఎం 44 10 54
కాంగ్రెస్ 02 08 10
టీడీపీ 01 07 08
బీజేపీ  04 07 11
మొత్తం 150 67 217

 
మేయర్ ఎన్నిక బహిష్కరిద్దామా
గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించడం ఖాయమైన నేపథ్యంలో ఆ ఎన్నికలో పాల్గొనాలా లేదా అన్న మీమాంసలో టీడీపీ నేతలున్నారు. ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా లేదా ఇంకా తేల్చుకోలేదని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement