క్లైమాక్స్
► పతాక స్థాయికిపార్టీల ప్రచారం
► బాబు, కేసీఆర్‌లపై కాంగ్రెస్ నిప్పులు
► తాను ఇక్కడే ఉంటానని బాబు భరోసా
► రోడ్డు షోలతో వేడి పెంచిన బీజేపీ, ఎంఐఎం
► నేడు భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ సన్నాహాలు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తోంది. దీంతో అన్ని పార్టీలూ ప్రచారంలో వాడిని... ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచేశాయి. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేసి టీడీపీ, టీఆర్‌ఎస్‌లపై దుమ్మెత్తిపోశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు వివిధ సభల్లో పాల్గొని టీడీపీ-బీజేపీ క్యాడర్‌లో స్థైర్యం నింపే దిశగా ప్రసంగించారు. తాను ఎక్కడికీ పోనని, ఇక్కడే ఉంటానని పునరుద్ఘాటించారు. బాబుకు తోడు తొమ్మిది మంది ఏపీ మంత్రులు సైతం నగర ప్రచారంలో తలమునకలయ్యారు. బీజేపీ నేతలు మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు ఖైరతాబాద్, కార్వాన్, అంబర్‌పేటలలో పర్యటించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముషీరాబాద్‌తో పాటు పాత బస్తీలో పాదయాత్రలు చేశారు.
భారీ సభకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు
ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకుతూ శనివారం మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ సభను నిర్వహించనుంది. ప్రతి డివిజన్ నుంచి కనీసం వెయ్యి మందిని సమీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభ కావటంతో టీఆర్‌ఎస్ మంత్రులు, ముఖ్య నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు.