అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు | MIM MLA Akbaruddin ovaisi statements | Sakshi
Sakshi News home page

అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు

Published Thu, Sep 8 2016 6:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు

అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు

- పహిల్వాన్ గ్యాంగ్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశా
- హత్యాయత్నానికి 17 రోజుల ముందే చంపుతామని బెదిరించారు
- కోర్టులో వాంగ్మూలమిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్

సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పహిల్వాన్ గ్యాంగ్ ఆక్రమించిందని  వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే తనను అంతమొందించాలని వారు ప్రయత్నించారనీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో అక్బరుద్దీన్ బుధవారం రెండోసారి నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు. ఆ వివరాలు ఇలా...

 2009 ఎన్నికల్లో నా ప్రత్యర్థికి మద్దతిచ్చారు
‘2009 ఎన్నికల్లో మహ్మద్ పహిల్వాన్ నా ప్రత్యర్థి ఎంబీటీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచే నామీద కక్ష పెంచుకొని చంపుతామని బెదిరించారు. పహిల్వాన్, మునావర్ ఇక్బాల్‌లు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చాను. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ స్పందించి ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్లు గుర్తించారు. 2011 ఏప్రిల్ 13న గుర్రంచెరువు కట్ట ప్రాంతంలో స్థానిక ఆర్‌ఐతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వస్తుండగా యూనుస్ బిన్ ఓమర్ యాఫై ఆయన కుమారుడు ఈసా బిన్ యూనుస్ యాఫైలు నా వాహనాన్ని ఆపారు.

నాతో వాగ్వాదానికి దిగి చంపుతామని బెదిరించారు. పహిల్వాన్ గ్యాంగ్ అక్రమాలను అడ్డుకుంటున్నాననే కక్షతోనే నన్ను చంపి అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 30, 2011న కత్తులు, తుపాకులు, క్రికెట్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. ఈ దాడిలో అనేకచోట్ల కత్తులతో పొడిచారు. బుల్లెట్ గాయాలయ్యాయి’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఈ సందర్భంగా తనను చంపుతామని బెదిరించిన మునావర్ ఇక్బాల్, యూనుస్ బిన్ ఓమర్ యాఫైలను అక్బరుద్దీన్ గుర్తించారు.

 కేర్ ఆసుపత్రిలో 20 రోజులు చికిత్స పొందా
‘‘దాడి తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాను. ముందుగా నన్ను ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కేర్ ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందాను. కేర్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. జూలైలో గ్లోబల్ ఆసుపత్రిలో కడుపు భాగంలో,  సెప్టెంబర్‌లో ఎడమ చేయి ఎముకను సరిచేసేందుకు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి సమయంలో మూత్రపిండం, పెద్దపేగు దెబ్బతిన్నాయి. మూత్రపిండం ఐరన్‌ను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో 2012 జనవరిలో స్టంట్ వేశారు’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఇదిలా ఉండగా పహిల్వాన్ సహా ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు గురువారం అక్బరుద్దీన్‌ను క్రాస్‌ఎగ్జామినేషన్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement