జూడాల వినూత్న నిరసన
కవాడిగూడ: సమ్మె కొనసాగిస్తున్న జూడాలు బుధవారం వినూత్నరీతిలో నిరసనవ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పరీక్షిత్, కైలాష్‌పతి, సూర్యప్రభాత్, మహేందర్, గౌతమ్, రేష్మ, నిఖిల్‌లు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాస్క్ ధరించిన నిరసనకారునికి జూనియర్ డాక్టర్లు చెవి పరీక్షలు చేశారు.
తమ సమస్యలు పట్టించుకోనందున ఇలా వినూత్నంగా నిరసనవ్యక్తం చేశారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు డాక్టర్ క్రాంతి చైతన్యలు మాట్లాడుతూ గ్రామీణ సేవ చేసేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సరైన రీతిలోస్పందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు నాగార్జున, అనిల్, భావ్య, స్వప్నిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.