జూరాలకు చేరిన కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు శనివారం జూరాల ప్రాజెక్టుకు చేరాయి. ప్రాజెక్టులోకి నీరు చేరుతున్న విషయాన్ని మహబూబ్‌నగర్ ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ ధ్రువీకరించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎగువ నుంచి తాగునీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
దీనికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించింది. ఒక టీఎంసీ నీటి విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈ నెల 20న కర్ణాటక ఇరిగేషన్ విభాగం ముఖ్య కార్యదర్శి రాకేశ్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. మరోవైపు నీటివిడుదలకు సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వానికి హరీశ్‌రావు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.