విద్యార్థులకు న్యాయం చేయండి: రఘువీరా
ప్రభుత్వం అనుసరించిన విధానాల మూలంగా విద్యార్ధులు తీవ్రంగా నష్ట పోయారని రఘువీరా రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: మెడికల్ కౌన్సిలింగ్ లో ఏపీ ప్రభుత్వం అనుసరించిన అసంబద్ధ విధానాల మూలంగా రిజర్వేషన్ ఉన్న విద్యార్ధులు తీవ్రంగా నష్ట పోయారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని ఆయన గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ పూర్తి కాకుండానే ఏపీలో సీట్లు భర్తీ చేశారని దీంతో 550 సీట్లు బ్లాక్ చేయబడ్డాయని, పద్మావతీ కళాశాలలో సీట్లు విడిగా భర్తీ చేయడం, 127 సీట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు.
నిత్యం బడుగుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇందుకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంకు 2283 అయితే నాల్గవ కౌన్సిలింగ్ కి వచ్చే సరికి ఆ ర్యాంకు 3354 కు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో 2283 ర్యాంకు తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు తీవ్రంగా నష్ట పోయారని వారందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు.