
కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
ప్రజలకు సంబంధించిన అంశాలపై కలిసే ప్రయత్నం చేశాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై సూచనలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు చిత్తశుద్ధితో పోరాటం చేసినట్టుగానే... ఇప్పుడు రాష్ట్ర వికాసం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి, వికాసం, సంక్షేమం లక్ష్యమని జేఏసీ ఆవిర్భావం నుంచి తాము చెబుతున్నామన్నారు.
కావాలంటే తాము చెప్పిన మాటలను మరోసారి చూసుకోవాలని సూచించారు. ‘‘వివిధ ప్రజాసంఘాలతో జేఏసీ నిర్మాణమైంది. జేఏసీ లేకుంటే మంత్రులంతా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మంత్రులంతా మాట్లాడుతున్నారంటే జేఏసీ ఉన్నట్టే కదా..’’ అని వ్యాఖ్యానించారు. ప్రజల వికాసానికి, అభివృద్ధికి సంబంధించిన చర్చ చాలా ముఖ్యమన్నారు. ‘‘ప్రజలు లేకుంటే మేం లేం.. మీరు(ప్రభుత్వం) లేరు. ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం అవసరం లేకుంటే చెప్పండి. జేఏసీని ఎవరు ఏర్పాటు చేసినా తెలంగాణ వచ్చేదాకా రాష్ట్రం కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకున్నాం. జేఏసీ వెనుక ప్రజలే ఉన్నారు’’ అని స్పష్టంచేశారు.
ప్రజా సంఘాలుగా ఒత్తిడి తేవడం గతంలోనూ ఉంది..
ఇప్పటిదాకా తానే ఒకరికి చెప్పానని, తనకు వేరొకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు, అందుకు అవసరమయ్యే కార్యాచరణ చుట్టే పనిచేస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని రాజకీయ జెండాగా మార్చడానికి ప్రయత్నం చేస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాలేమీ ఇందులో లేవని, ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సంఘాలుగా ప్రజల కోసం పనిచేయడం ప్రపంచంలోనే వినూత్న ప్రయోగమన్నారు. ప్రజాసంఘాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం గతంలోనూ తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. రాజకీయ ప్రక్రియను తక్కువ చేయడం లేదని, అది సక్రమంగా పనిచేయాలని కోరుతున్నామన్నారు. రాజకీయ ప్రక్రియ సరిగా పనిచేయకుంటే ప్రశ్నిస్తామని స్పష్టంచేశారు.
వర్సిటీ సమస్యలపై త్వరలో సెమినార్
యూనివర్సిటీలకు వీసీలు లేరని, టీచింగ్ స్టాఫ్ లేదని కోదండరాం అన్నారు. యూనివర్సిటీల సమస్యలపై ఓయూలో త్వరలోనే ఒక సెమినార్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పోలీసులతో పర్యవేక్షణ పనికిరాదన్నారు. భూసేకరణ చట్టాలపై అవగాహన, వివరణ లేకపోవడంతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు అవగాహన కల్పించడానికి గజ్వేల్‌లో సెమినార్‌ను నిర్వహిస్తామని తెలిపారు. 2013 చట్టానికి సంబంధించి, ప్రాజెక్టుల్లో అనుసరించాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. చట్టంలోనే మెరుగైన నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి కేసులు చేసిన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామన్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తాం..
సింగరేణి ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తామని కోదండరాం తెలిపారు. సింగరేణి సీఎండీని కూడా కలుస్తామన్నారు. హైకోర్టు విభజన జరగలేదని, న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా ఉంటామన్నారు. ‘‘న్యాయం కోసం చేసే పోరాటానికి న్యాయమూర్తులు అండగా ఉంటామన్నారు. కరువుపై జిల్లాల్లో చేసిన అధ్యయనం, కరువు పరిస్థితులపై నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. కరువుపై ఒక మాన్యువల్, దానికి చట్టబద్దత కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు’’ అని కోదండరాం పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో వివిధ ప్రజాసంఘాలకు చెందిన నేతలు పి.రఘు, పి.ప్రహ్లాద్, పిట్టల రవీందర్, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాకు ప్రజల భాషే వచ్చు
మంత్రులతో సహా తమపై విమర్శలు చేస్తున్న వారికి తానేం చెప్పాలని కోదండరాం ప్రశ్నించారు. వారు మాట్లాడుతున్న భాష తనకు రాదని, కేవలం ప్రజల భాష మాత్రమే వచ్చునన్నారు. ‘‘మా డిక్షనరీ చాలా చిన్నది. ప్రజాసంఘంగానే పనిచేస్తాం. ప్రజా సంఘంగానే ఉంటాం. ప్రజల కోసం పనిచేస్తున్నందుకే మాపై కొంతమందికి ఆగ్రహం వచ్చినట్టుంది. కొందరికి ఆగ్రహం వస్తే మా పని ఆపం కదా’’ అని అన్నారు. గ్రామస్థాయి నుంచి జేఏసీని నిర్మాణం చేసి, బలోపేతం చేస్తామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు, దాడులు ఎదురైనా ప్రజల కోసం చేస్తున్న తమ ప్రయాణం ఆగదన్నారు. మూసివేసిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం పని చేస్తామని చెప్పారు. హిందూస్థాన్ కేబుల్ పరిశ్రమను, నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల జీతాలు పెంచారని, వారికి బకాయిలు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. జేఏసీ ఇచ్చే సూచనలు బాగుంటే స్వీకరించాలి తప్ప ఇంతలా విమర్శలు అవసరం లేదని కోదండరాం సూచించారు.