
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యా రు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించటంతో పాటు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు దర్బార్ హాల్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ వేడుకలకు అధికారులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చి గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇన్‌చార్జి వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.