సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. సభా వేదికపై ఏర్పాటు చేసిన పార్టీ జెండాను అధ్యక్షుడు కేసీఆర్ ఆవిష్కరించడంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం అమరవీరులకు నివాళి అర్పించిన ఆయన తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు.
తర్వాత అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సభ నిమిషం పాటు మౌనం పాటించింది. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు. ‘‘కేసీఆర్ నేతృత్వంలో నడుంబిగించి సుభిక్షమైన రాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకుని జీవిస్తున్నాం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిలో సంతోషం కనిపిస్తోంది. 2001లో స్వరాష్ట్రం కోసం నడుంబిగించినట్టే ఇప్పుడు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న నాయకుడికి అండగా నిలవాలి.’అని ఆయన అన్నారు.
సభ పెట్టిన్రా... సర్కస్ పెట్టిన్రా
సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బస్వరాజు మాట్లాడిన వెంటనే కేసీఆర్ మైక్ తీసుకొని.. ‘సారయ్య మాట్లాడింది ఎవరికైనా అర్థం అయిందా?’అని సభికులను ప్రశ్నించారు. మైకుల నుంచి ఎందుకు రీసౌండ్ వస్తోందని ప్రశ్నించారు.
వెంటనే వేదికపై ఉన్న ఏసీలు బంద్ చేయించి సౌండ్ సిస్టం సరిచేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కళ్లల్లోకి కొడుతున్న లైట్లను ఆపేయాలని సూచించారు. కొంతసేపటి తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ‘ఏం తమాషానా.. సభ పెట్టిన్రా.. సర్కస్ పెట్టిన్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మైకులు సరిచేయడంతో సభా కార్యకలాపాలు కొనసాగాయి.
ముందు వరుసలో మంత్రులు
సభావేదికపై కేసీఆర్‌తోపాటు ముందు వరుసలో మంత్రులు ఆసీనులయ్యారు. పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు ముందు వరుసలోనే కూర్చున్నారు. వెనుక వరుసల్లో పార్టీ పదవుల్లో ఉన్న నేతలు కూర్చున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ప్రతినిధుల గ్యాలరీల్లోనే కూర్చున్నారు. రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు.
కవిత సెల్ఫీల హంగామా
ఉదయం 10:30 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకున్న నిజామాబాద్ ఎంపీ కవిత సెల్ఫీలతో హంగామా చేశారు. సభా ప్రాంగణమంతా కలియ తిరుగుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, వలంటీర్లు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. అందరితో ఓపిగ్గా సెల్ఫీలు దిగిన కవిత ప్రతినిధుల మధ్యనే కూర్చున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా మంగ్లీ
ప్లీనరీ సమావేశాలకు రేలారే రేలారే ఫేం మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధూంధాం నిర్వహించిన పాటల కార్యక్రమంలో ఆమె ‘రేలారే రేలారే..’పాటతోపాటు కేసీఆర్‌పై ప్రత్యేకంగా రాసిన పాటను పాడి అలరించారు. రసమయి నేతృత్వంలోని కళాకారుల బృందం ఆటపాటలతో సభికులను ఆకట్టుకున్నారు.
అన్ని వసతులు..
ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పించారు నిర్వహకులు. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, పోలీసు సిబ్బంది, ప్రతినిధులకు విడివిడిగా భోజన ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతినిధులకు ఏర్పాటు చేసిన భోజనశాలల వద్ద చివర్లో హడావుడి కనిపించింది. అన్నం అయిపోవడం, ప్లేట్లు లేకపోవడంతో ప్రతినిధులు భోజనం కోసం కాసేపు నిరీక్షించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment