కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: కోఠి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేగింది. హాస్టల్‌లోకి వెళ్తున్న ఓ విద్యార్థినిని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేయడానికి యత్నించారు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. అప్రమత్తమైన తోటి విద్యార్థినులు ఓ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు.. ఆమెను తమ వెంట తీసుకెళ్లడానికి యత్నించారు. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి బిగ్గరగా కేకలు వేసింది. తోటి విద్యార్థినులు వెంటనే స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. హాస్టల్ సమీపంలో వీధిలైట్లు లేకపోవడంతో.. పోకిరీల బెడద ఎక్కువైందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.