సికింద్రాబాద్: రైల్వేస్టేషన్ ఆవరణలో మూడు రోజుల క్రితం జరిగిన పసికందు కిడ్నాప్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. కిడ్నాపర్ పరారీలో ఉండగా పసికందును కోనుగోలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏసీపీ శివప్రసాద్, గోపాలపురం ఇన్‌స్పెక్టర్ ఎస్.రామచంద్రారెడ్డితో కలిసి ఉత్తర మండలం అదనపు డీసీపీ పీవై గిరి తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లాకు చెందిన టి.రమాదేవి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుని జీవిస్తోంది.
చెత్తకాగితాలు సేకరిస్తూ జీవించే రమాదేవి 27 రోజుల క్రితం మగబిడ్డ (నాగాచారి)కు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా... టోలీచౌకికి చెందిన ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్ నిర్వాహకుడు మహ్మద్ ఆరీఫ్ (25) సోదరికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. సోదరి భర్త కోరిక మేరకు ఒక మగబిడ్డను వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు ఆరీఫ్. అదే ప్రయత్నంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అతను ఆ ప్రాంతంలో చిల్లర పనులు చేసుకుంటూ జీవించే సురేష్‌ను సంప్రదించాడు. తనకు కొంత డబ్బు వస్తుందని ఆశించిన సురేశ్.. రమాదేవి దగ్గరకు వెళ్లి ఆమె కుమారుడిని విక్రయిస్తే రూ.5 వేలు ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు రమాదేవి అంగీకరించలేదు. కాగా, సురేష్ ఈనెల 17న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తున్న రమాదేవి వద్దకు వెళ్లి మాటల్లోకి దింపాడు.
ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో సురేశ్ .. పసికందు నాగాచారిని అపహరించుకెళ్లాడు. రమాదేరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన గోపాలపురం పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా సురేష్ బాలుడిని అపహరించి ఆల్ఫా హోటల్ వద్ద ఆరీఫ్‌కు అప్పగించినట్టు గుర్తించారు. ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... సురేష్‌కు రూ. 15 వేలు ఇచ్చి బాలుడిని కొనుగోలు చేసి తన సోదరికి ఇచ్చానని చెప్పాడు. పోలీసులు పసికందు నాగాచారిని స్వాధీనం చేసుకొని రమాదేవికి అప్పగించారు. ఆరీఫ్‌ను రిమాండ్‌కు తరలించి, పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు.
తల్లిఒడికి పసికందు
Published Fri, Nov 20 2015 8:44 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
Advertisement
Advertisement